Advertisement

  • రజినీకాంత్ జీవితంలోని ప్రేమకథ...సినిమా స్టోరీని తలపిస్తోంది...

రజినీకాంత్ జీవితంలోని ప్రేమకథ...సినిమా స్టోరీని తలపిస్తోంది...

By: chandrasekar Mon, 07 Dec 2020 2:36 PM

రజినీకాంత్ జీవితంలోని ప్రేమకథ...సినిమా స్టోరీని తలపిస్తోంది...


కర్ణాటక రాష్ట్రానికి చెందిన సూపర్‌స్టార్ రజనీకాంత్ తమిళ సినిమాల్లో నటిస్తూ దక్షిణాది సూపర్‌స్టార్‌గా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే సినీ హీరో కాకముందు ఆయన జీవితంలో అందమైన ప్రేమకథ ఉందన్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సినిమా స్టోరీని తలపించే ఆ ప్రేమకథను గురించి తెలుసుకుందాం. రజనీకాంత్ బెంగళూరు నగరంలో బస్ కండక్టర్‌గా పనిచేస్తున్న రోజుల్లో ఆయన డ్యూటీ చేసే బస్సులోనే నిర్మల అనే వైద్య విద్యార్థిని రోజూ ప్రయాణించేది. ఈ క్రమంలోనే వారిద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. రజినీకాంత్ రోజూ డ్యూటీ ముగిశాక ఆమెను పార్కులో కలుసుకుని ప్రేమ ఊసులు చెప్పేవారు. ఓ రోజు సాయంత్రం ఆమెను థియేటర్‌కు రమ్మని చెప్పడంతో ఆమె ఒంటరిగా అక్కడికి వెళ్లారు. అదే సమయంలో అక్కడ ఓ నాటకం జరుగుతోంది. అందులో ఓ వేషం వేసిన రజినీకాంత్‌ నటన, స్టైల్‌ని చూసి నిర్మల మైమరచిపోయింది.

రజినీకాంత్‌కు కొద్దిరోజుల తర్వాత చెన్నైలోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఓ లెటర్ వచ్చింది. ఈ విషయాన్ని ప్రియురాలికి చెప్పిన ఆయన తాను అప్లై చేయని కోర్సుకు ఆఫర్ లెటర్ ఎలా వచ్చిందోనని అయోమయంలో పడ్డారు. నటనపై నీకున్న ఆసక్తిని గమనించి నీ పేరు మీద నేనే దరఖాస్తు చేశా, సర్‌ప్రైజ్ చేద్దామనే నీకు చెప్పలేదు అని నిర్మల చెప్పడంతో రజినీ షాకయ్యారు. అక్కడ ట్రైనింగ్ తీసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని, తనకు అంత ఆర్థిక స్తోమత లేదని ఆయన తెలిపారు. అయితే జీవితాంతం బస్ కండక్టర్‌గానే ఉండిపోతావా?. అని నిర్మల ఆయనకు నచ్చజెప్పి చెన్నైకి పంపించారు. రజినీ ఖర్చుల కోసం ఆమె అప్పుడప్పుడు డబ్బులు పంపించేవారు. రజినీకాంత్ ట్రైనింగ్ పూర్తిచేసుకుని ఎన్నో కష్టాలు పడుతూ చివరికి సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. ఓ వైపు షూటింగుల్లో పాల్గొంటూనే ప్రియురాలి నుంచి వచ్చిన లేఖలను భద్రంగా దాచుకుంటూ ఆమెకు ప్రత్యుత్తరాలు రాసేవారు. హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో ఆమె నుంచి ఉత్తరాలు రావడం ఆగిపోయాయి. దీంతో కొద్దిరోజుల తర్వాత బెంగళూరు వెళ్లిన రజినీకాంత్ నిర్మల ఇంటికి వెళ్లగా అక్కడ మరో ఫ్యామిలీ కనిపించింది. దీంతో చుట్టుపక్కల వారిని ఆరా తీయగా నిర్మల కుటుంబం చాలారోజుల క్రితమే ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని, ఎక్కడికి వెళ్లారో తెలియని సమాధానమిచ్చారు. నిర్మల కోసం రజినీకాంత్ బెంగళూరు నగరంలో అనేక ప్రాంతాల్లో వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. నిర్మల జ్ఞాపకాలు తనతోనే ఉంచుకున్న రజినీ ఆమె ఇచ్చిన స్ఫూర్తితో సాధారణ హీరో నుంచి సూపర్‌స్టార్‌గా ఎదిగారు. అయితే తాను సినిమాల్లోకి రావడానికి ఎంతో ప్రోత్సహించిన నిర్మలను మళ్లీ కలుసుకోలేకపోవడం తనను ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుందని రజినీకాంత్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

Tags :

Advertisement