Advertisement

  • ముగ్గురు గ్రామ వలంటీర్లు సహా ఐదుగురు కలిసి కిడ్నాప్ చేసిన ఉదంతం

ముగ్గురు గ్రామ వలంటీర్లు సహా ఐదుగురు కలిసి కిడ్నాప్ చేసిన ఉదంతం

By: chandrasekar Mon, 29 June 2020 6:57 PM

ముగ్గురు గ్రామ వలంటీర్లు సహా ఐదుగురు కలిసి కిడ్నాప్ చేసిన ఉదంతం


అనంతపురం జిల్లా శింగనమలలో ఇద్దరు మైనర్ బాలికలను ముగ్గురు గ్రామ వలంటీర్లు సహా ఐదుగురు కలిసి కిడ్నాప్ చేసిన ఉదంతం సంచలనం రేపుతోంది. కుట్టు మిషన్ నేర్చుకుంటున్న ఇద్దరు బాలికలు దారం అయిపోవడంతో తెచ్చుకునేందుకు బయటకు వెళ్లగా అడ్డగించిన ఐదుగురు వ్యక్తులు కారులో ఎత్తుకెళ్లారు.

కిడ్నాపర్లు అదే గ్రామానికి చెందిన ముగ్గురు వలంటీర్లు కావడం సంచలనం రేపుతోంది. మరో ఇద్దరు వారి స్నేహితులు అని తెలుస్తోంది. పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

వారి చెర నుంచి బాలికలను విడిపించారు. వారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతపురం జిల్లా శింగనమల మండలం లోలూరు గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో పోలీసుల ముగ్గురు వాలంటీర్లు సహా ఐదుగురిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఆ గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు పక్క గ్రామంలో టైలరింగ్ పని నేర్చుకుంటున్నారు.

దీనిపై బాలికలు మాట్లాడుతూ జూన్ 25న దారం కోసం బయటకు వెళ్లగా మత్తు మందు చల్లిన గుడ్డతో గట్టిగా కట్టేసి కారులో ఎక్కించి తీసుకెళ్లారని తెలిపారు. కళ్లు తెరిచి చూస్తే ఎక్కడున్నామో తెలియలేదన్నారు. తమ ఎదురుగా గ్రామ వలంటీర్లు శివరాం, చంద్రశేఖర్‌, మధుసూదన్‌తో పాటు వారి ఫ్రెండ్స్ చంద్రముత్యాలు, రామాంజనేయులు ఉన్నారని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదే రోజు అనంతపురంలో నిందితులను అరెస్ట్ చేసి బాలికలను కాపాడారు. నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గ్రామానికి చెందిన మైనర్ బాలికలను స్థానికంగా ఉన్న వలంటీర్లు కిడ్నాప్ చేశారన్న వార్త ప్రజలను భయాందోళనకు గురిచేసింది. రాష్ట్రంలో గ్రామ వలంటీర్లు తరుచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ప్రభుత్వ ప్రతినిధులుగా పనిచేస్తున్న వలంటీర్లే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం, సేవలు ప్రజల ఇంటికే చేర్చాలనే గొప్ప ఉద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. అయితే కొందరు వలంటీర్ల కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. తాజాగా శింగనమలలో బాలికల కిడ్నాప్ వ్యవహారంలో ముగ్గురు వలంటీర్ల ప్రమేయం ఉండటం సంచలనంగా రూపుదిద్దుకుంది


Tags :

Advertisement