Advertisement

  • ప్రభుత్వానికి మరోసారి కీలక ఆదేశాలు జారీచేసిన హైకోర్టు

ప్రభుత్వానికి మరోసారి కీలక ఆదేశాలు జారీచేసిన హైకోర్టు

By: chandrasekar Fri, 19 June 2020 11:50 AM

ప్రభుత్వానికి మరోసారి కీలక ఆదేశాలు జారీచేసిన హైకోర్టు


కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై ఇప్పటికే ఎన్నో విమర్శలున్నాయి. తక్కువ పరీక్షలు, తప్పుడు లెక్కలు చూపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర హైకోర్టు సైతం పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి కీలక ఆదేశాలు జారీచేసింది హైకోర్టు. కరోనా వైరస్‌కు సంబంధించి కీలక సమాచారం మీడియా బులెటిన్‌లో ఉండాలని స్పష్టం చేసింది.

జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నందున వార్డుల వారీగా కేసుల వివరాలను ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం డాక్టర్లకు పీపీఈ కిట్లు, మాస్కులు, రక్షణ పరికరాలు ఇవ్వడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారించింది హైకోర్టు.

ఈ విచారణకు రాష్ట్ర పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు హాజరయ్యారు. రాష్ట్రంలో 79 మంది వైద్యులకు కరోనా సోకినట్లు పబ్లిక్‌ హెల్త్ డైరెక్టర్‌ ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ, యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ ప్రయోగాలు చేస్తున్నట్లు రాజారావు కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లో వార్డుల వారీగా కరోనా కేసులను వెల్లడించి వారిని ఆయా కాలనీ సంఘాలకు ఇవ్వాలని స్పష్టం చేసింది.

అంతేకాదు ర్యాపిడ్‌ యాంటీజెన్ టెస్ట్‌ నిర్వహించాలంటూ ఐసీఎంఆర్‌ చెప్పిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బందితో పాటు పోలీసులకు కూడా రక్షణ కిట్లు ఇవ్వాలని సూచించింది. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ సిబ్బందికి షిఫ్ట్‌ల విధానం అమలు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షలను వేగవంతం చేయాలని తమ ఆదేశాల్లో పేర్కొంది.

దీనికి సంబంధించి ఈ నెల 29లోగా నివేదిక సమర్పించాలని సూచించింది హైకోర్టు. కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 5675 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 3071 మంది డిశ్చార్జ్ కాగా 192 మరణించారు. తెలంగాణలో ప్రస్తుతం 2412 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|

Advertisement