Advertisement

  • ఆధార్ కార్డు వివరాల్లో చట్ట విరుద్ధంగా మార్పులు చేస్తున్న ముఠా గుట్టు రట్టు

ఆధార్ కార్డు వివరాల్లో చట్ట విరుద్ధంగా మార్పులు చేస్తున్న ముఠా గుట్టు రట్టు

By: chandrasekar Fri, 28 Aug 2020 10:33 AM

ఆధార్ కార్డు వివరాల్లో చట్ట విరుద్ధంగా మార్పులు చేస్తున్న ముఠా గుట్టు రట్టు


ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత సాధించేలా ఇష్టానుసారం వయసు పెంచుతూ, తగ్గిస్తూ అడ్డదారిలో డబ్బులు దండుకుంటున్న ముఠాను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు కాకాని రోడ్డులో ఉన్న సిటీ మార్కెట్‌ కాంప్లెక్స్‌‌లో కొంతమంది వ్యక్తులు గది అద్దెకు తీసుకొని ఆధార్ అప్‌డేషన్ కార్యాలయం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి, నకిలీ స్టాంపులతో, ఆధార్‌ కార్డులో వ్యక్తుల వయస్సు పెంచుతూ రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు డబ్బులు దండుకుంటున్నారు. పక్కా సమాచారంతో బుధవారం ఈ కార్యాలయపై దాడి చేసి 8 మందిని అరెస్ట్ చేశారు. అమరావతికి చెందిన అడపాల సాయి, గుంటూరు ఆనందపేటకు చెందిన షేక్‌ ఖాజా ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ఆధార్‌ అప్‌డేట్‌ సంస్థ ప్రతినిధులుగా పనిచేశారు. వీరు మరికొందరు వ్యక్తులతో కలిసి అక్రమంగా ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేస్తున్నారు.

చదువు రాని వ్యక్తులను టార్గెట్ చేసి వైఎస్సార్ చేయూత పథకానికి సరిపోయేలా వయసును మారుస్తామని.. అలా చేయడం ద్వారా ప్రభుత్వం నుంచి పెన్షన్ అందుకోవచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 500 ఆధార్ కార్డుల్లో వయసును మార్చారు. దీనిపై అర్బన్‌ ఎస్పీకి నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. ఈ ముఠా గుట్టును రట్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితుల బ్యాంకు అకౌంట్లు సీజ్‌ చేయడంతోపాటు ల్యాప్‌ ట్యాప్, లాగిటెక్‌ కెమెరా, బయోమెట్రిక్‌ ఐరిష్‌ స్కానర్లు రెండు, ఐరిష్‌ కెమెరా, ఫింగర్‌ స్కానర్, కలర్‌ ప్రింట్‌ కమ్‌ స్కానర్, 10 నకిలీ రబ్బరు స్టాంపులు, ఇతర సాంకేతిక సామగ్రి, రూ.22 వేలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుల అకౌంట్లలో ఉన్న రూ.2.42 లక్షలను త్వరలో సీజ్‌ చేస్తామని పోలీసులు తెలిపారు. ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాల్సిన వారు.. ఆధార్ సేవా కేంద్రాలు, బ్యాంకుల్లోనే సరిచేయించుకోవాలని గుంటూరు అర్బన్ ఎస్పీ ప్రజలకు తెలిపారు.

Tags :

Advertisement