Advertisement

తొలి 'లవ్ జిహాద్' కేసు నమోదు..

By: chandrasekar Thu, 03 Dec 2020 11:16 PM

తొలి 'లవ్ జిహాద్' కేసు నమోదు..


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కారు బలవంతపు మతమార్పిడులను నిరోధించేందుకు ఇటీవల కొత్త చట్టాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టానికి ఆమోదం లభించిన వారం రోజుల్లోనే ‘లవ్ జిహాద్’పై డియోరానియా పోలీస్ స్టేషన్‌లో తొలి కేసు నమోదైంది. బలవంతపు మత మార్పిడి చట్టం ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీకి చెందిన ఒక ముస్లిం యువకుడిని అరెస్టు చేశారు. అయితే, కేసు నమోదైన ఐదు రోజుల్లోనే నిందితుడిని అరెస్టు చేసి, జైలుకు పంపడం విశేషం.

వివరాల్లోకి వెళ్తే.. 21 ఏళ్ల నిందితుడు హిందూ మతానికి చెందిన బాలికతో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తూ ఆమెను ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో ఆ బాలిక పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి ఐదు రోజుల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇస్లాం మతంలోకి మారకుంటే నిందితుడు తనను చంపేస్తానని బెదిరించాడని బాలిక తన ఫిర్యాదులో తెలిపింది. అయితే, కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ సమయంలోనే బాలిక తండ్రి వేరొక మహిళను వివాహం చేసుకోవడం గమనార్హం. కాగా, కేసుపై విచారణ చేపట్టిన ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఇటీవల అమల్లోకి వచ్చిన బలవంతపు మత మార్పిడి నిరోధక చట్టం ప్రకారం సెక్షన్ 3/5తో పాటు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 504, 506 కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు డిసెంబర్ 2న అరెస్టు చేశారు.

ఎస్‌ఎస్‌పి డాక్టర్ సంసర్ సింగ్ మాట్లాడుతూ ‘‘భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 504 (ఒక వ్యక్తిని కించపరచడం), 506 (బెదిరింపులకు గురిచెయ్యడం), ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 24న అమల్లోకి తెచ్చిన బలవంతపు మత మార్పిడి చట్టంలోని సెక్షన్ 3/5 కింద నిందితుడిని అరెస్టు చేశాం.’’ అని తెలిపారు. ఈ చట్టం ప్రకారం లవ్ జీహాద్ సంబంధిత కేసుల్లో ఎవరైనా దోషిగా తేలితే గరిష్టంగా 10 సంవత్సరాల వరకు కఠినమైన శిక్ష విధిస్తారు. వివాహం కోసం అమ్మాయిని మతం మారాలని బలవంతం చేస్తే, అలాంటి వివాహం చట్టప్రకారం చెల్లదని ప్రకటించడమే కాకుండా, మతమార్పిడికి సహాయం చేసే వారికి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అబద్ధం, దురాశ, లేదా మరేదైనా మోసపూరిత మార్గం ద్వారా మతం మార్చి వివాహం చేసుకోవడం బెయిల్ లేని నేరం కిందకి వస్తుందని ఈ చట్టం పేర్కొంటుంది.

Tags :
|
|
|

Advertisement