Advertisement

కేరళలోని గ్రామస్థులు చేసిన నేరం

By: chandrasekar Fri, 05 June 2020 12:29 PM

కేరళలోని గ్రామస్థులు చేసిన నేరం


ప్రకృతికి ఏ హాని చేయకుండా ఈ భూమి మీద అడవిలో తమ మానాన తాము బతుకుతున్న జంతువులకు మానవుడు పెట్టిన ముద్దు పేరు క్రూరమృగాలు. కానీ మానవుడి క్రూరత్వం ముందు వాటిది ఏపాటి? అవి మనిషి క్రూరత్వానికి ఎన్నటికి సాటి రావు. కేరళలోని ఓ గ్రామస్థులు చేసిన నేరం ఈ ప్రపంచాన్ని ఏడిపిస్తోంది. బహుశా ఈ దశాబ్దంలో మానవుడు చేసిన అత్యంత నికృష్టమైన అత్యంత అమానవీయ హత్య ఇది. కడుపుతో ఉన్న ఏనుగు మనిషి క్రూరత్వానికి బలైన అత్యంత విచారకరమైన సంఘటన కేరళలో జరిగింది.

ఓ ఏనుగుకు ఆకలేసి ఆహారం కోసం వెతుక్కుంటూ గ్రామంలోకి వెళ్లింది. మనిషికి ఏ మాత్రం హాని చేయ ప్రయత్నించలేదు. తన మానాన తాను నడుచుకుంటూ పోతుంటే ఒక నికృష్ట యువకుల గుంపు పైనాపిల్ ను కోసి అందులో క్రాకర్స్ నింపి మళ్లీ పైనాపిల్ లా కనిపించేలా మూసి ఏనుగుకు అందించారు. వీరి మోసం తెలియని ఆ మూగ జీవి మనిషెంత మంచోడు అనుకుంటూ అది నోట్లో పెట్టుకుని నమిలే ప్రయత్నం చేయగానే ఠప్పున పేలాయి టపాసులు.

అంతే దాని నోరు కాలి జలజలా రక్తం నేల కారింది. అయినా అది మనుషుల మీద దాడి చేయలేదు. అలా రోదిస్తూ వెళ్లిపోయింది. కడుపులో ఆకలి, నోట్లో మంట దిక్కుతోచని పయనం దిక్కు తెలియని ప్రయాణం అలా వెళ్తూ ఉండగా వెల్లియార్ నది కనిపించింది. అందులో దిగగానే దప్పిక తీర్చుకుంది. మంట నుంచి కొంచెం ఉపశమనం దొరికింది. దీనిని చాలాసేపు ఎవరూ గమనించలేదు. దయనీయం ఏంటంటే ఆ ఏనుగు గర్భంతో ఉంది. గర్భంతో ఉన్న జీవికి ఆకలెక్కువ. అప్పటికే రెండు రోజులుగా ఆహారం లేదు. నది నుంచి బయటకు వెళితే మంటను తట్టుకోలేదు.

the crime,committed,by the villagers,of kerala,elephant ,కేరళలోని, గ్రామస్థులు, చేసిన, నేరం, ఏనుగు


చివరకు ఎవరో దానిని గమనించి అటవీ అధికారులకు సమాచారం ఇస్తే వారు మరో రెండు ఏనుగులను తీసుకొచ్చి కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అది మిమ్మల్ని మరోసారి నమ్మే ప్రసక్తే లేదని నదిలోనే భీష్మించుకు నిల్చుంది. అధికారుల ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు అలాగే మే27వ తేదీ సాయంత్రం ప్రాణం వదిలింది. దాంతో అక్కడి నుంచి అధికారులు దానిని తరలించి పరీక్షలు చేసినపుడు అది గర్భంతో ఉన్న విషయం బయటపడింది. వైద్యులు అయ్యోపాపం అనుకున్నారు.

ఇపుడు ఈ సంఘటనపై విచారణ చేస్తున్నారు. నిందితులను పట్టుకునే పనిలో ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఈ ఏనుగు వయసు 15 సంవత్సరాలు. కేరళ అటవీ శాఖ దీని గురించి ఓ ట్వీట్ చేస్తూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51-ఎ (జి) ప్రకారం ఈ భూమి మీద ఉన్న జీవుల పట్ల కనికరం చూపడం భారతదేశంలోని ప్రతి పౌరుడి కర్తవ్యం అని పేర్కొంది. ఈ గర్భిణీ ఏనుగు మానవ-వన్యప్రాణుల సంఘర్షణలో క్రూరంగా హత్య చేయబడింది.

Tags :

Advertisement