Advertisement

  • ఓ ఉమ్మడి కుటుంబంలో తీవ్ర విషాదం నింపిన కరోనా వైరస్ మహమ్మారి

ఓ ఉమ్మడి కుటుంబంలో తీవ్ర విషాదం నింపిన కరోనా వైరస్ మహమ్మారి

By: chandrasekar Sat, 12 Sept 2020 12:28 PM

ఓ ఉమ్మడి కుటుంబంలో తీవ్ర విషాదం నింపిన కరోనా వైరస్ మహమ్మారి


కరోనా వైరస్ మహమ్మారి ఓ ఉమ్మడి కుటుంబంలో 20 రోజుల వ్యవధిలో తండ్రితోపాటు ఇద్దరు కుమారులు బలయ్యారు. రూ.1 కోటి 30 లక్షలు ఖర్చు పెట్టినా ఫలితం లేకుండా పోయింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలానికి చెందిన చకినారపు భూమయ్య (70)ది ఉమ్మడి కుటుంబం. ఆయనకు నలుగురు కొడుకులు కాగా మూడో కుమారుడు 20 ఏళ్ల క్రితమే చనిపోయాడు. తర్వాత భూమయ్య కుటుంబం మంచిర్యాలకు షిఫ్ట్ అయ్యింది. జిల్లా కేంద్రంలో నక్షత్ర ఇంజినీరింగ్ పేరిట ఓ షాప్ నడుపుతున్నారు. ఆర్థికంగా బాగా స్థిరపడటంతోపాటు ముగ్గురు కొడుకులకు పెళ్లిళ్లయ్యాయి. అనుబంధాలు, ఆత్మీయతల విలువ తెలిసిన కుటుంబం కావడంతో ఇప్పటికే అందరూ కలిసే ఉంటున్నారు.

కానీ ఆగస్టు నెలలో భూమయ్యతోపాటు రెండో కొడుకు కిరణ్ కుమార్‌కు, పిల్లలకు కరోనా సోకింది. భూమయ్య, కిరణ్ హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌లో చేరగా చిన్నారులు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండి కోలుకున్నారు. కాగా పరిస్థితి విషమించడంతో ఆగస్టు 22న భూమయ్య చనిపోయారు. తర్వాత భూమయ్య మరో కుమారుడు కిషోర్ కుమార్‌కు కూడా కరోనా సోకింది. కొద్ది రోజులు ఐసోలేషన్‌లో ఉన్న ఆయన లక్షణాలు పెరుగుతుండటంతో హైదరాబాద్‌లో తన సోదరుడు చికిత్స పొందుతున్న హాస్పిటల్‌లో చేరాడు. పరిస్థితి విషమించడంతో సెప్టెంబర్ 4న ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరిని కోల్పోయిన విషాదం నుంచి తేరుకోక ముందే సెప్టెంబర్ 5న కిరణ్ కుమార్ కూడా కరోనాతో కన్నుమూశారు. ముగ్గురికీ కలిపి వైద్యానికి రూ.1 కోటి 30 లక్షలు ఖర్చు చేశారు. కానీ ముగ్గురూ కరోనాకు బలికావడంతో ఆ కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా ఉంది.

Tags :
|

Advertisement