Advertisement

  • కాళేశ్వ‌రం ప్రాజెక్టు యొక్క ఇంజినీరింగ్ అద్భుతమని ప్రశంసించిన కేంద్ర బృందం

కాళేశ్వ‌రం ప్రాజెక్టు యొక్క ఇంజినీరింగ్ అద్భుతమని ప్రశంసించిన కేంద్ర బృందం

By: chandrasekar Fri, 23 Oct 2020 09:12 AM

కాళేశ్వ‌రం ప్రాజెక్టు యొక్క ఇంజినీరింగ్ అద్భుతమని ప్రశంసించిన కేంద్ర బృందం


రాష్ట్రానికి గొప్ప ప్రాజెక్టుగా అభివర్ణిస్తున్న కాళేశ్వ‌రం ప్రాజెక్టు పై కేంద్ర బృందం ప్రశంసలు అందించింది. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ఇంజినీరింగ్ అద్భుతమ‌ని కేంద్ర బృందం ప్ర‌శంసించింది. భారీ వ‌ర్షాల వ‌ల్ల జ‌రిగిన న‌ష్టాన్ని ప‌రిశీలించేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి విచ్చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా పంట న‌ష్టం వాటిల్లిన పొలాల‌ను మ‌ర్కుక్‌లో ప‌రిశీలించిన అనంత‌రం స‌మీపంలోనే ఉన్న కొండ‌పోచ‌మ్మ సాగ‌ర్ పంప్‌హౌజ్‌ను కేంద్ర బృందం సంద‌ర్శించింది.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్ర‌త్యేక‌త‌ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామ‌రెడ్డి కేంద్ర బృందానికి వివ‌రించారు. కేవలం మూడేళ్లలోనే రూపుదిద్దుకున్న గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం అని తెలిపారు. సముద్రమట్టానికి 100 మీటర్ల ఎత్తులో ఉన్న మేడిగడ్డ నుంచి 624 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మసాగర్‌ వరకు నీటిని ఎత్తిపోసేలా కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్ప‌న జ‌రిగిన‌ట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌తో సిద్దిపేటతో సహా 9 జిల్లాలు లబ్ది పొందనున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో హైదరాబాద్ న‌గ‌రానికి సైతం శాశ్వత సాగునీటి సౌకర్యం కలిగిందన్నారు.

రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, సకాలంలో ఎరువులు, విత్తనాలు, మద్దతు ధరతో పంట ఉత్పత్తుల కొనుగొలు చేస్తుందన్నారు. కొండపోచమ్మ సాగర్ పంప్‌హౌస్‌తో పాటు జలాశయంను వీక్షించిన బృంద సభ్యులు కాళేశ్వ‌రం ప్రాజెక్టు సాగు నీటిరంగంలోనే గొప్ప ఆవిష్కరణగా, ఇంజినీరింగ్ అద్భుతంగా ఉందని అభివర్ణించారు. ఇది మన రాష్ట్రానికే గర్వ కారణం.

Tags :
|

Advertisement