Advertisement

  • అంతర్రాష్ట్ర జలవివాదాలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రందే: వినోద్‌కుమార్‌

అంతర్రాష్ట్ర జలవివాదాలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రందే: వినోద్‌కుమార్‌

By: chandrasekar Mon, 05 Oct 2020 09:40 AM

అంతర్రాష్ట్ర జలవివాదాలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రందే: వినోద్‌కుమార్‌


ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగా మధ్య నెలకొన్న జల వివాదాన్ని పరిష్కరించాల్సింది కేంద్ర ప్రభుత్వమే అని వినోద్‌కుమార్‌ తెలిపారు. తెలుగు రాష్ట్రాల జలవివాదాన్ని నాన్చుతున్నది కేంద్ర ప్రభుత్వమేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర జలవివాదాలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంలోని బీజేపీ సర్కారుదేనని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జలవివాదం అనేది రాష్ట్రాల పరిధిలో తేలే అంశం కాదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన ఆరు వారాల్లోనే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాన్ని పరిష్కరించాలని 14-7-2014 నాడు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు కేంద్ర జల వనరుల శాఖ మంత్రికి లేఖ రాశారని, అదే రోజు రాష్ట్ర ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శికి నోటీస్ ఇచ్చారని వినోద్‌కుమార్‌ గుర్తుచేశారు. అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టం 1956 లోని సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు లేకుండా పరిష్కారం చూపాలని గత ఆరేళ్లుగా సీఎం కేసీఆర్‌ కోరుతున్నారని వినోద్‌కుమార్‌ చెప్పారు. గత కొన్ని రోజులుగా ఇరు ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఈ వివాదం తార స్థాయికి చేరింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతోపాటు కేంద్ర జల వనరుల శాఖ మంత్రులు ఉమా భారతి, నితిన్ గడ్కరీకి లేఖలు రాశారని గుర్తుచేశారు. దీంతో పాటు అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరిగేషన్ కార్యదర్శి, కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులకు లేఖలు రాశారని తెలిపారు. అంతర్రాష్ట్ర నదీ జలాల సమస్యను పరిష్కరించాలని గత 16వ లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు గట్టిగా గళాన్ని వినిపించారని, అప్పటి కేంద్ర మంత్రులు ఉమా భారతి, నితిన్ గడ్కరీలపై ఒత్తిడి పెంచారని వినోద్‌కుమార్‌ తెలిపారు. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా వచ్చిందని చెప్పారు. సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర మంత్రి ఉమాభారతి ప్రయత్నం చేస్తున్న దశలో నాడు మహారాష్ట్ర, కర్ణాటక బీజేపీ ఎంపీలు లోక్ సభలో గందరగోళం సృష్టించి అడ్డుకున్నారని, తెలంగాణ కు అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టం సెక్షన్ 3 ప్రకారం ఏడాదిలోగా కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరించకుంటే సుప్రీంకోర్టులో సవాలు చేశామని, దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని వినోద్ కుమార్ వివరించారు. కనీసం విషయం తెలియకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని వినోద్‌కుమార్‌ మండిపడ్డారు. ఇది వారి అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.

ఇక్కడ ఏర్పడ్డ సమస్యను అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టం సెక్షన్ 3 మేరకు ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి ఈ వివాదాన్ని కేంద్ర ప్రభుత్వమే పరిష్కరించాల్సి ఉంటుందని వినోద్‌కుమార్‌ స్పష్టంచేశారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలను విస్మరించి , విషయం తెలుసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పై చౌకబారు విమర్శలు చేయడం శ్రేయస్కరం కాదన్నారు. విషయ పరిజ్ఞానం లేకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ పుట్టినప్పటి నుంచి కేంద్రానికి వరుసగా లేఖలు రాస్తూ, ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా వ్యక్తిగతంగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించడం సరికాదని వినోద్‌కుమార్‌ హితవుపలికారు. సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వివాదాలు పెట్టుకోవద్దని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించాలనే విశాల దృక్పథంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని ఆయన తెలిపారు. పొరుగు రాష్ట్రాలతో ఘర్షణ వైఖరి వల్ల దశాబ్దాల నుంచి అనేక ప్రాజెక్టులు అమలుకు నోచుకోలేదని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మరో ఇద్దరు బీజేపీ ఎంపీలకు రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర జల వనరుల శాఖ మంత్రిలపై ఒత్తిడి తేవాలన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపుల కోసం ప్రస్తుతం ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు ఆదేశాలు ఇప్పించేందుకు కృషి చేయాలని సూచించారు.

Tags :

Advertisement