Advertisement

  • చైనా ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని గణనీయంగా పెంచాలని కేంద్రం ఆలోచన

చైనా ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని గణనీయంగా పెంచాలని కేంద్రం ఆలోచన

By: chandrasekar Sat, 11 July 2020 5:00 PM

చైనా ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని గణనీయంగా పెంచాలని కేంద్రం ఆలోచన


దేశ సరిహద్దులో భారత జవాన్లను అన్యాయంగా పొట్టనబెట్టుకున్న దురహంకార చైనాకు తగిన బుద్ధిచెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని వ్యూహాత్మక చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే టిక్ టాక్, హలో సహా చైనాకు చెందిన 59 యాప్స్‌ను దేశంలో బ్యాన్ చేయడంతో చైనాను ఆర్థికంగా చావుదెబ్బతీసింది మోదీ సర్కారు. ఆర్థికంగా చైనాను మరింత దెబ్బతీసే వ్యూహంతో మరికొన్ని చర్యలు తీసుకునేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది.

ఓ వైపు చైనాను అర్థకంగా దెబ్బతీస్తూనే ఉత్పత్తి రంగంలో దేశంలో తయారైన ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగా చైనా సహా ఇతర విదేశీ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని గణనీయంగా పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు ‘సీఎన్‌బీసీ టీవీ18’ వెల్లడించింది. వివిధ ఉత్పత్తులపై ప్రస్తుత దిగుమతి సుంకాలను సమీక్షించి కొత్త సుంకాలకు సంబంధించిన ప్రతిపాదనలు, కార్యాచరణను సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖలకు ఆదేశాలిచ్చింది.

అన్నిరంగాలకు చెందిన సంస్థలు, నిపుణులతో సంప్రదింపులు జరిపి దీనికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. వీరి సిఫార్సుల మేరకు విదేశీ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను ఏమేరకు పెంచాలన్న విషయంపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ ప్రక్రియను ప్రధానమంత్రి కార్యాలయం దీన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. పలు మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులు త్వరలోనే ఆయా రంగానికి చెందిన నిపుణులతో కలిసి ఈ అంశంపై చర్చించనున్నారు. మరికొన్ని రోజుల్లోనూ వారు కేంద్రానికి తమ ప్రతిపాదనల నివేదికలను సమర్పించనున్నారు.

ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, ఆటోమొబైల్, భారీ పరిశ్రమలు, పునరుత్పాదక విద్యుత్, టెక్స్‌టైల్స్, రసాయన మరియు ఎరువులు, వాణిజ్య తదితర మంత్రిత్వ శాఖలతో ఈ విషయంపై కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు సంప్రదింపులు చేయనున్నారు. విదేశీ ఉత్పత్తులపై దిగుమతులు పెంచడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం ఏమేరకు ఉండనుంది? దాని ద్వారా ఏర్పడే ఉత్పత్తుల కొరతను భర్తీ చేసుకునేందుకు దేశీయ పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు తదితర అంశాలపై ఆయా మంత్రిత్వ శాఖలు నివేదికలు సమర్పించనున్నాయి. దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సంవృద్ధిని సాధించే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

దిగుమతి సుంకాలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకోనున్న చర్యలతో చైనా కంపెనీలు తీవ్రంగా నష్టపోయే అవకాశముంది. దేశంలోకి చైనా కంపెనీల ఉత్పత్తులను వీలైనంత మేరకు తగ్గించడమే కేంద్రం ఉద్దేశం కావచ్చని తెలుస్తోంది. చైనాకు చెందిన యాప్స్‌తో పాటు మేడిన్ చైనా ఉత్పత్తులను కూడా బ్యాన్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. డబ్ల్యూటీవోలో భారత్ భాగస్వామ్యంకావడంతో చైనా ఉత్పత్తులను బ్యాన్ చేయడంలో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతుంది.

అయితే దిగుమతి సుంకాలు గణనీయంగా పెంచడం ద్వారా వాటికి చెక్ పెట్టాలన్నది కేంద్ర ప్రభుత్వ యోచనగా తెలుస్తోంది. విదేశీ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను గణనీయంగా పెంచడం ద్వారా దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో పాటు భారీ పరిశ్రమలకు కూడా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే చైనాకు చెందిన ఉత్పత్తులకు దేశంలోని నౌకాశ్రయాల నుంచి బయటకు తరలించేందుకు క్లియరెన్స్ దక్కకపోవడంతో చైనీస్ బ్రాండ్స్ తీవ్రంగా నష్టపోతున్నాయి.

Tags :

Advertisement