Advertisement

రజనీ ఇంట్లో బాంబు పెట్టామని బెదిరింపు కాల్స్

By: chandrasekar Fri, 19 June 2020 10:09 AM

రజనీ ఇంట్లో బాంబు పెట్టామని బెదిరింపు కాల్స్


సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్స్ రావడం సినీ, రాజకీయ వర్గాలను ఓ కుదుపు కుదిపేసింది. పోయిస్ గార్డెన్స్‌లోని రజనీ ఇంట్లో బాంబు పెట్టామని, అది ఏ నిముషం లోనైనా పేలుతుందని పేర్కొంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ రావడం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. వెంటనే అలర్ట్ అయిన పోలీస్ యంత్రాంగం రజనీ ఇంటికి చేరుకొని గాలించారు.

బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్క్వాడ్‌తో రజనీ ఇంటితో పాటు చుట్టుపక్కల పరిసరాల్లో కూడా గాలింపు చేపట్టారు. అయితే ఎంత వెతికినా బాంబ్ ఆచూకీ లభించకపోవడంతో అది ఫేక్ కాల్ అని కన్ఫర్మ్ చేశారు చెన్నై పోలీసులు.

ఎవరో కావాలనే ఇలా అలజడి సృష్టించే ప్రయత్నం చేశారని, రజనీ ఇంట్లో గానీ ఇంటి పరిసరాల్లో గానీ బాంబు లేదని వెల్లడించారు. ఈ క్రమంలో సదరు ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతేడాది కూడా ఇలాగే రజనీకాంత్ ఇంట్లో బాంబ్ ఉందంటూ ఫేక్ కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు ఫోన్‌ నంబర్‌ ఆధారంగా ఆ వ్యక్తిని పట్టుకున్న పోలీసులు అతని మానసిక పరిస్థితి సరిగా లేదని నిర్థారించారు.

మళ్ళీ ఇప్పుడు అదే మాదిరి ఎవరో బాంబ్ కలకలం సృష్టించడం జనాల్లో చర్చనీయాంశం అయింది. మరోవైపు ఈ మధ్యే తమిళనాడు సీఎం పళనిస్వామి ఇంట్లో కూడా బాంబ్ ఉందని బెదిరింపు కాల్ రావడంతో అది ఫేక్ కాల్ అని పోలీసులు తేల్చారు. ఈ క్రమంలో ఇలాంటి ఫేక్ కాల్స్, వాట్సాప్ సందేశాలను సీరియస్‌గా తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నా కూడా కొందరు ఆకతాయిలు ఏ మాత్రం భయపడకుండా అదే పని పెట్టుకున్నారు.

Tags :
|

Advertisement