Advertisement

  • సముద్రంలో 70 మీటర్ల లోతులో నేవీ కమాండర్ నిషాంత్‌ సింగ్ మృతదేహం

సముద్రంలో 70 మీటర్ల లోతులో నేవీ కమాండర్ నిషాంత్‌ సింగ్ మృతదేహం

By: chandrasekar Tue, 08 Dec 2020 08:29 AM

సముద్రంలో 70 మీటర్ల లోతులో నేవీ కమాండర్  నిషాంత్‌ సింగ్ మృతదేహం


మిగ్ విమానం సముద్రంలో కూలిన విషయం అందరికి తెలిసిందే. కాని అందులో వున్న పైలట్ ప్రాణాలతో బయటపడి ఉంటారని అందరూ ఊహించారు. కానీ ఊహించిన దానికి వ్యతిరేకంగా జరిగింది. మిగ్-29కే యుద్ధ విమానం ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదం నుంచి బయటపడి ఎక్కడో చిక్కుకొని ఉంటారని భావించిన పైలట్, నేవీ కమాండర్ నిషాంత్ సింగ్ కన్నుమూశారు. ఘటన జరిగిన రెండు వారాల తర్వాత ఆయన మృతదేహాన్ని గుర్తించారు. కమాండర్ నిషాంత్‌ సింగ్ మృతదేహాన్ని గోవాకు 30 మైళ్ల దూరంలో నావికా దళాలు కనుగొన్నాయి. ఇందు కోసం కొన్ని రోజులుగా ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి. సముద్రంలో 70 మీటర్ల లోతులో నిషాంత్‌ మృతదేహం కనిపించినట్లు ఇండియన్ నేవీ వర్గాలు తెలిపాయి. ఇండియన్ నేవీకి చెందిన మిగ్‌-29కే శిక్షణ విమానం నవంబర్ 26న అరేబియా సముద్రంలో కూలిపోయింది. రష్యా టెక్నాలజీతో తయారుచేసిన ఈ ఫైటర్ జెట్ ఆ రోజు సాయంత్రం ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌక మీద నుంచి ఆశాశంలోకి ఎగిరింది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు ఫైటర్ జెట్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఆ సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఆ సమయంలో ప్రమాదానికి ముందు మరో పైలట్ విమానం నుంచి పారాచ్యూట్ సాయంతో కిందకు దూకేశారు. ఆ తర్వాత ఆయణ్ని నావికా దళాలు రక్షించాయి. కానీ పైలట్‌ నిషాంత్‌ సింగ్‌ మాత్రం గల్లంతయ్యారు. ఆయన కూడా ఎక్కడో ఓ చోట సురక్షితంగా దిగి ఉంటారని అందరూ భావించారు. కానీ, అలా జరగలేదు. ప్రమాదం జరిగిన 3 రోజుల అనంతరం మిగ్-29కేకు సంబంధించిన కొన్ని శకలాలు సముద్రంలో లభ్యమయ్యాయి. తీవ్ర గాలింపు చేపట్టడంతో ఇది బయటపడింది.

ఈ గాలింపులో విమాన శకలాలు దొరికినప్పటికీ పైలట్ నిషాంత్‌ ఆచూకీ మాత్రం తెలియలేదు. దీంతో ఆయన ఎక్కడో సురక్షితంగానే ఉండి ఉంటారని అందరూ ఆశగా ఎదురుచూశారు. కానీ, చివరకు విషాదామే మిగిలింది. నిషాంత్‌ మృతదేహం లభ్యమైన విషయాన్ని నేవీ అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. ఫార్మాలిటీ ప్రకారం డీఎన్‌ఏ పరీక్ష జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. గల్లంతైన పైలట్ నిషాంత్‌ సింగ్ జాడ కనుక్కోవడానికి 9 యుద్ధనౌకలు, 14 విమానాలను వినియోగించారు. ప్రత్యేక సాంకేతికను ఉపయోగించారు. గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దించారు. చివరకు రెండు వారాల అనంతరం పైలట్‌ నిషాంత్ మృతదేహాన్ని గుర్తించారు. మిగ్‌-29 యుద్ధ విమానాలు తరచూ ప్రమాదాల బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఫైటర్ జెట్లను వినియోగించడాన్ని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ - కాగ్ 2016లోనే తప్పుపట్టింది. కాగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ విమానాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. మిగ్-29 ఫైటర్‌ జెట్‌ ఎయిర్‌ ఫ్రేమ్‌లో చిక్కులు ఉన్నాయని కాగ్ నివేదికలో పేర్కొన్నారు. దీంతో పాటు దీనిలో వినియోగించే ఆర్‌డీ-33 ఎంకే ఇంజిన్‌, ఫ్లైబై వైర్‌ వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. ఈ విమానంలో రెండు ఇంజిన్లు ఉంటాయి. ఒక ఇంజన్‌ మోరాయించినా రెండో ఇంజిన్‌తోనే తంటాలుపడి విమానాన్ని ల్యాండ్‌ చేసిన సందర్భాలు ఉన్నాయి. 2016 వరకే ఇలాంటివి 10 ఘటనలు చోటు చేసుకొన్నట్లు కాగ్ నివేదికలో పేర్కొన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి ఘటన జరగడంతో విషాదం చోటుచేసుకుంది.

Tags :

Advertisement