Advertisement

  • తెలంగాణ ముఖ్యమంత్రి విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి

తెలంగాణ ముఖ్యమంత్రి విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి

By: chandrasekar Tue, 20 Oct 2020 09:19 AM

తెలంగాణ ముఖ్యమంత్రి విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి


రాష్ట్రంలో భారీగా పడిన వర్షాలకు సహాయం కోసం సీఎం కేసీఆర్ గారు వైఎస్ జగన్‌ను సాయం కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం విజ్ఞప్తికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తక్షణమే స్పందించారు. తెలుగు రాష్ట్రాల్లో గత పది రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఆ వర్షాల దెబ్బ నుంచి కోలుకోక మునుపే మళ్లీ వర్షాలు పడుతుండటం రానున్న నాలుగైదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ మరింత అప్రమత్తమైంది.

ప్రస్తుతం వరద బాధితులను ఆదుకొని వారిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకుగాను సీఎం కేసీఆర్ గారు వైఎస్ జగన్‌ను సాయం కోరారు. భారీ వర్షాలతో ఇప్పటికే హైదరాబాద్ అతలాకుతలమవ్వడం, మళ్లీ అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో భాగ్యనగరంలో వరద సహాయ పునరావాస చర్యలకై స్పీడ్ బోటులు పంపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కోరింది. ఈ అభ్యర్థనకు తక్షణమే సీఎం స్పందించారు.

తెలంగాణకు సహాయం చేయడంలో భాగంగా వెంటనే స్పీడు బోట్లను పంపాలని విపత్తుల నిర్వహణ సంస్థ, పర్యాటక శాఖ ఉన్నతాధికారులను సీఎం జగన్ ఆదేశించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి మూడు, పర్యాటక శాఖ ద్వారా ఐదు మొత్తం ఎనిమిది స్పీడు బోటులను వెంటనే హైదరాబాద్‌ పంపిస్తున్నట్టు సంబంధిత అధికారులు తెలియజేశారు. అంతేకాకుండా ఈ స్పీడ్ బోటులతో పాటు ఆయా బోటుల సామర్థ్యానికి అనుగుణంగా ఎస్డీఆర్ఎఫ్‌కు సంబంధించిన ఈతగాళ్లను (డ్రైవర్స్), తగినన్ని లైఫ్ జాకెట్లను పంపుతున్నట్లు అధికారులు తెలియజేశారు. మంగళవారం నుంచి ఈ ఎనిమిది స్పీడ్ బోట్లు రంగంలోకి దిగనున్నాయని తెలుస్తోంది. దీని ద్వారా బాధితులకు సహాయం అందనుంది.

Tags :

Advertisement