Advertisement

  • స్వర్ణ ప్యాలెస్ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

స్వర్ణ ప్యాలెస్ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

By: chandrasekar Mon, 10 Aug 2020 2:18 PM

స్వర్ణ ప్యాలెస్ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో కరోనా కేర్ సెంటర్‌గా మారి అగ్ని ప్రమాదానికి కారణమైన స్వర్ణ ప్యాలెస్ దుర్ఘటనపై 2 వేర్వేరు కమిటీలను వేసింది. ఆస్పత్రికి లైసెన్సులు, ఇతర అంశాలపై దర్యాప్తుకి ఆరోగ్యశ్రీ సీఈవో, వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్‌లతో ఒక కమిటీని వేసింది. అలాగే ప్రమాదానికి కారణాలపై అగ్నిమాపక శాఖ డీజీ, ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్, చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్‌లతో మరో కమిటీని వేసింది.

ఈ రెండు కమిటీలు రెండ్రోజుల్లో అంటే 48 గంటల్లో తమ రిపోర్టులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అంటే ఇవాళ కమిటీల సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లి ఫటాఫట్ వివరాలు తెలుసుకొని ఆధారాలు సేకరించుకొని రేపు రిపోర్ట్ రెడీ చేసి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి కమిటీకి ఇదేమంత కష్టం కాదు. ఎందుకంటే ఏం జరిగిందో, ఎలా జరిగిందో ఆల్రెడీ అందరికీ తెలుసు. లైసెన్సులను పరిశీలించి రిపోర్ట్ రూపంలో ఇవ్వడానికి 48 గంటలు సరిపోతుందని ప్రభుత్వం భావించింది. రెండో కమిటీకి మాత్రం ఎక్కువ పనే ఉంటుంది.

ఆ కమిటీ సభ్యులు ఇవాళ స్వర్ణా ప్యాలెస్‌ హోటల్ ఆస్పత్రిలో ఫైర్ సేఫ్టీ లోపాలపై ఫోకస్ పెట్టనున్నారు. ఆస్పత్రి మొత్తాన్నీ తనిఖీ చేస్తారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకుంటారు. షార్ట్ సర్క్యూట్, కరెంటు వైర్లు, సరఫరా అన్నీ గమనిస్తారు. మొత్తం వివరాలతో ఓ రిపోర్టును ఇస్తారు. అదే సమయంలో ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఏం చెయ్యాలో కూడా రిపోర్టులో ప్రతిపాదనలు ఇవ్వాల్సి ఉంటుంది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దుర్ఘటనలో రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌ను కరోనా కేర్ సెంటర్‌గా మార్చి కరోనా పేషెంట్లకు అందులో ట్రీట్‌మెంట్ అందిస్తోంది. స్వర్ణ ప్యాలెస్ లో ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల 10 మంది చనిపోయారు. దీనిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. రమేష్ ఆస్పత్రి నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించిన ప్రభుత్వం గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించింది. ప్రైవేట్ కరోనా ఆస్పత్రుల్లో ఇలా జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ వారంలోనే ప్రత్యేక డ్రైవ్‌ చేయబోతోంది.

Tags :

Advertisement