Advertisement

  • ఎన్‌కౌంటర్ కొనసాగుతుండగా అతడు చివరి సారి తన తండ్రితో ఫోన్ లో మాట్లాడిన ఆడియో టేపు సంచలనంగా మారింది...!

ఎన్‌కౌంటర్ కొనసాగుతుండగా అతడు చివరి సారి తన తండ్రితో ఫోన్ లో మాట్లాడిన ఆడియో టేపు సంచలనంగా మారింది...!

By: Anji Tue, 29 Dec 2020 11:07 AM

ఎన్‌కౌంటర్ కొనసాగుతుండగా అతడు చివరి సారి తన తండ్రితో ఫోన్ లో మాట్లాడిన ఆడియో టేపు సంచలనంగా మారింది...!

జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాలతో ఎన్‌కౌంటర్ కొనసాగుతుండగా అతడు చివరి సారి తన తండ్రికి ఫోన్ కలిపి మాట్లాడాడు. ఈ సంచలన ఆడియో టేపు చేతికి చిక్కింది. ఆ సంభాషన ఇలా సాగింది..
యువకుడు: నాన్నా నేను ఆమిర్. మీరు బావున్నారా..?

తండ్రి: హా.. బేటా.. నువ్ ఎక్కడ ఉన్నావ్?

యువకుడు: మేం దొరికిపోయాం.. క్రీరిలో, నాతో పాటు మరొక వ్యక్తి ఉన్నాడు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి..
మేం సరెండర్ అవుదామనుకున్నాం.. కానీ, మార్గం లేదు. వాళ్లు అందరినీ చంపేస్తారు. సరెండర్ అనే ఆలోచన వస్తేనే అందరినీ చంపేస్తామని చెప్పారు.

తండ్రి: అయ్యో బేటా, ఇప్పుడు బయటపడే మార్గమే లేదా..?

యువకుడు: లేదు. నేను తప్పు చేశా. వాళ్ల మాటలు విని ప్రభావితమయ్యా (manipulate). వాళ్లు బలవంతంగా నా చేతిలో ఆయుధం పెట్టి ఫోటో తీశారు. అది వైరల్ అయ్యేలా చేశారు.

ఆర్మీ దృష్టిలో పడేలా చేశారు. నేను ఇంటికి తిరిగొచ్చేద్దామనుకున్నా.. కానీ, వాళ్లు నా తల్లిని, తండ్రిని, తమ్ముడిని, చెల్లెలిని అందరినీ చంపేస్తారు.

తండ్రి: మేమేం చేయాలి? నువ్ లేకుండా మేం ఎలా బతకాలి?

యువకుడు: అయ్యో.. నాన్నా. మీరు అలా మాట్లాడొద్దు. నేను ఇలా చెప్పానని ఎవరితో చెప్పొద్దు. నా ప్రాణాలు పోయేలోపు మీకు నిజం చెప్పాలని ఫోన్ చేశా.
నేను తప్పు చేశా. నాకేం తెలియదు. నేను ఇటు వైపు ఎలా వచ్చానో కూడా అర్థం కావట్లేదు. ఇది నాకొక పాఠం. నా తమ్ముడికి, స్నేహితులకు చెప్పండి.. ఇది చాలా భయంకరమైన మార్గం.

ఇటు వైపు రావాలనే ఆలోచనే చేయొద్దని చెప్పండి. కెరీర్ మీద దృష్టి పెట్టి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని చెప్పండి.

తండ్రి: నువ్ లేకుండా నీ చెల్లి, నీ తల్లి ఎలా ఉండగలుగుతుంది? వాళ్లకు ఏం చెప్పాలి? (గద్గర స్వరంతో..)
యువకుడు: అందరికీ అదే చెప్పండి. నేను ఎంచుకున్న మార్గానికి భవిష్యత్తు లేదు. బయటపడటానికి ఎలాంటి మార్గం లేదు.
నేను నా జీవితాన్ని వృథా చేశాను. ఇప్పుడు తిరిగి వద్దామనుకున్నా రాలేని పరిస్థితుల్లో ఉన్నా. నేను ఇప్పుడు చేయగలిగిందల్లా ఒక్కటే.. నా తమ్ముడు, స్నేహితులు ఈ దారిలోకి రాకుండా చూడటం. అందుకే మీకు ఫోన్ చేశా.

ఇండియన్ ఆర్మీ, కశ్మీర్ పోలీసులు నాకు లొంగిపోవడానికి అవకాశం ఇచ్చారు. కానీ, లొంగిపోలేను. అలా చేస్తే అందరినీ చంపేస్తారు. నేను ఇన్ని రోజులు గట్టిగా పట్టుకున్నదే నా మృత్యువు. దాణ్నుంచి ఇక బయటపడలేను.

నేను నా తల్లిదండ్రుల చెంతకు తిరిగి రావాలనుకుంటున్నా. వాళ్ల కోసం కష్టపడి పని చేయాలనుకుంటున్నా. నా జీవితానికి అర్థం వెతుక్కోవాలని అనుకుంటున్నా.. కానీ, నాన్నా.. నాకు ఆ అవకాశం లేదు.

నా తలరాత ఇంతే. నాకు జరిగినట్టుగా నా కుటుంబసభ్యులకు, స్నేహితులకు ఎవరికీ జరగకూడదు. అదే నా కోరిక.

తండ్రి: బేటా నీకు ఇప్పటికీ మార్గం ఉంటే రావడానికి ప్రయత్నించు.

యువకుడు: నేను నా విధిరాతను అంగీకరించాల్సిందే. నాలా మరెవరూ చావకూడదని కోరుకుంటున్నా. నేను తప్పు చేశా. నన్ను క్షమించండి..

కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని క్రీరి పట్టణ శివార్లలో నాలుగు రోజుల కిందట ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆ ఉగ్రవాది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

ఫుట్‌బాల్ ప్లేయర్ అయిన ఆ యువకుడు.. చెప్పుడు మాటలు విని తప్పుడు దారి ఎంచుకున్నట్లు అతడి మాటల ద్వారా అర్థమవుతోంది. దేవుడు అతడికి మరో అవకాశం ఇస్తాడా..? ప్రస్తుతానికి ఇది సమాధానం లేని ప్రశ్నే!

Tags :

Advertisement