Advertisement

తెలంగాణ స‌ర్కార్ స్పందించిన తీరు శుభ‌సూచ‌కం

By: chandrasekar Tue, 23 June 2020 3:16 PM

తెలంగాణ స‌ర్కార్ స్పందించిన తీరు శుభ‌సూచ‌కం


జాతిభ‌క్తికి ఇదే నిద‌ర్శ‌నం. దేశాన్ని ర‌క్షిస్తున్న సైనికుల‌కు తెలంగాణ ఇచ్చే గౌర‌వం ఇది. స‌మ‌స్యాత్మ‌క‌మైన స‌రిహ‌ద్దుల్ని నిత్యం ప‌హారా కాస్తూ భర‌త‌మాతకు అన‌న్య‌మైన‌ సేవ‌లు అంద‌జేస్తున్న జ‌వాన్ల‌కు అండ‌గా నిల‌వ‌డం అంటే ఇదే.

వీరుడి మ‌ర‌ణాన్ని గుర్తించి ఆ కుటుంబానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదుకున్న తీరు అసాధార‌ణ‌మైంది. సైనిక యోధుల కుటుంబాల‌కు ప్ర‌భుత్వాలు ఎళ్ల‌వేళ‌లా తోడుగా ఉంటాయ‌న్న‌ భ‌రోసాను ఇచ్చే రీతిలో తెలంగాణ స‌ర్కార్ స్పందించిన తీరు శుభ‌సూచ‌కం. అత్యంత దైర్య‌సాహాసాలు ప్ర‌ద‌ర్శించే సైనికులే దేశ ర‌క్ష‌కులు. వారి కుటుంబాల‌కు అండ‌నివ్వ‌డం అది ప్ర‌భుత్వాల విధి. ఆ ధ‌ర్మాన్ని సీఎం కేసీఆర్ పాటించారు.

ల‌డ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ‌లో చైనా సైనికుల క్రూర‌మైన‌ దాడిలో క‌ల్న‌ల్ బిక్కుమ‌ళ్లు సంతోష్‌బాబు ప్రాణాలు విడిచాడు. దొంగదెబ్బ తీసిన డ్రాగ‌న్ చేతిలో క‌ల్న‌ల్ సంతోష్‌తో పాటు అత‌ని బృందంలోని 20 మంది సైనికులు వీర‌మ‌ర‌ణం పొందారు. తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లాకు చెందిన క‌ల్న‌ల్ సంతోష్‌బాబుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఘ‌న నివాళి అర్పించింది. సైనికుల్లో మ‌నోనిబ్భ‌రాన్ని నింపే విధంగా సంతోష్ కుటుంబాన్ని తెలంగాణ స‌ర్కార్ ఆదుకున్న‌ది.

చైనాతో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో భార‌తీయ సైనికులు చ‌నిపోయిన‌ తీరు ప‌ట్ల సీఎం కేసీఆర్ తీవ్రంగానే స్పందించారు. ప్ర‌ధానితో జ‌రిగిన అఖిల‌ప‌క్ష భేటీలో తెలంగాణ ప్ర‌భుత్వం దేశ‌స‌రిహ‌ద్దు విష‌యంలో స్ప‌ష్ట‌మైన సంకేతాన్ని అందజేసింది. దేశ‌ర‌క్ష‌ణ అంశంలో రాజీప‌డేది లేద‌ని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఇలాంటి స‌మ‌యంలో రాజ‌నీతి కాదు, యుద్ధ నీతి కావాల‌న్నారు. కానీ డ్రాగ‌న్ దేశంతో అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కూడా కేసీఆర్ హెచ్చ‌రించారు. యుద్ధ నీతి ప్ర‌కార‌మే రాజ‌ధ‌ర్మాన్ని పాటించారు సీఎం కేసీఆర్‌. గాయ‌ప‌డ్డ సైనిక కుటుంబానికి వెల‌క‌ట్ట‌లేని సాయాన్ని అంద‌జేశారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా చూప‌ని క‌రుణ‌ను ఆయ‌న ప్ర‌ద‌ర్శించారు.

సూర్యాపేట వెళ్లిన సీఎం కేసీఆర్‌ అక్క‌డ క‌ల్న‌ల్ సంతోష్ కుటుంబాన్ని ప‌రామర్శించారు. తొలుత క‌ల్న‌ల్ చిత్ర‌ప‌టానికి పుష్ప నివాళి అర్పించారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నారు. క‌ల్న‌ల్ సంతోష్ భార్య సంతోషికి చెక్‌, జాబ్ ఆఫ‌ర్‌, ఇంటి స్థ‌లాల‌కు చెందిన ప‌త్రాల‌ను సీఎం కేసీఆర్ అంద‌జేశారు. వీర‌యోధుడి కుటుంబానికి అండ‌గా ఉంటాన‌ని ప్ర‌క‌టించిన సీఎం కేసీఆర్ ఓ మ‌హాయోధుడిలానే ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. ఇచ్చిన మాట ప్ర‌కారం 5 కోట్ల చెక్‌, గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం, హైద‌రాబాద్‌లో ఇంటి స్థ‌లాల‌కు చెందిన ప‌త్రాల‌ను కేసీఆర్ అంద‌జేశారు.

అమ‌ర జ‌వాన్ల కుటుంబాల్లో అఖండ స్ఫూర్తిని నింపే విధంగా సీఎం కేసీఆర్ త‌న మ‌హోన్న‌త‌ వ్య‌క్తిత్వాన్ని ప్ర‌ద‌ర్శించారు. దేశ‌ర‌క్ష‌ణ కోసం సంతోష్‌ ప్రాణ‌త్యాగం చేశార‌ని కుటుంబ‌స‌భ్యుల‌తో ఆయ‌న తెలిపారు. ఎప్పుడు ఏ అవ‌స‌రం వ‌చ్చినా న‌న్ను సంప్ర‌దించాలంటూ వారిలో ఆత్మ‌స్థైర్యాన్ని నింపారు. సంతోష్‌ మ‌ర‌ణం ఎంతోగా క‌లిచివేసింద‌న్నారు. సైనిక కుటుంబాల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌న్నారు.

Tags :

Advertisement