Advertisement

Breaking: రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు జమ...!

By: Anji Mon, 07 Dec 2020 11:02 PM

Breaking: రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు జమ...!

రైతు బంధు నిధుల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపికబురు అందించారు. రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు జమ చేయనున్నట్లు తెలిపారు.

ఇందుకు సంబంధించిన నిధులను విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. డిసెంబర్ 27వ తేదీ నుంచి 2021 జనవరి 7 వరకు రైతులకు రైతుబంధు సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

రైతుబంధు నిధుల పంపిణీకి సంబంధించి అధికారులతో సీఎం కేసీఆర్ సోమవారం (డిసెంబర్ 7) ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో ఏ ఒక్క రైతు మిగలకుండా అందరికీ సాయం అందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైతుల ఖాతాలోనే నేరుగా డబ్బులను జమ చేయాలని చెప్పారు.

దీని కోసం అవసరమైన రూ.7,300 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రైతుబంధు సహాయం పంపిణీకి అనుసరించాల్సిన విధానంపై చర్చించి, కార్యాచరణను ఖరారు చేశారు.

తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి మొదలుపెట్టి, ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతులకు రైతు బంధు నిధులు జమ చేయాలని కేసీఆర్ సూచించారు. రైతులందరి ఖాతాల్లో పది రోజుల వ్యవధిలో డబ్బులు జమ చేయాలని సూచించారు.

సమీక్షా సమావేశంలో యాసంగి సీజన్ రైతుబంధు సహాయం (రెండో విడత) పైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎలా నిరసన తెలపాలి, భారత్ బంద్‌ కార్యక్రమానికి మద్దతుగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Advertisement