Advertisement

  • తెలంగాణ ఆర్టీసీ అధికారులు కొత్త ప్రతిపాదన...విజయవాడ-హైదరాబాద్ రూట్లలో బస్సులు

తెలంగాణ ఆర్టీసీ అధికారులు కొత్త ప్రతిపాదన...విజయవాడ-హైదరాబాద్ రూట్లలో బస్సులు

By: chandrasekar Wed, 28 Oct 2020 1:50 PM

తెలంగాణ ఆర్టీసీ అధికారులు కొత్త ప్రతిపాదన...విజయవాడ-హైదరాబాద్ రూట్లలో బస్సులు


తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు పంతం వీడకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. అయితే అన్‌లాక్ సడలింపుల్లో భాగంగా అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు ఎత్తివేసినా రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిరగడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు తిరిగే కిలో మీటర్ల మధ్య తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాల విషయంలో తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సులు ప్రతి రోజు తెలంగాణలో 2.60 లక్షల కిలో మీటర్ల మేర తిరుగుతాయి. తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సులు ఏపీలో 1.66 లక్షల కిలో మీటర్ల మేర తిరుగుతూ రాకపోకలు సాగిస్తూ ఉంటాయి.

అయితే ఏపీ బస్సులు తెలంగాణలో లక్ష కిలోమీటర్లు ఎక్కువగా తిరుగుతున్నాయని, దీన్ని తగ్గించుకుని అంతర్రాష్ట్ర పర్మిట్లు తీసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులు సూచించారు. దీనిపై స్పందించిన ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు తాము 50 వేల కిలో మీటర్లు తగ్గించుకుంటామని తెలంగాణ 50 వేల కిలో మీటర్లు పెంచుకుంటే సరిపోతుందని ప్రతిపాదించారు. అయితే ఏపీలో అదనంగా తిప్పేందుకు తమ వద్ద బస్సులు లేవని తెలంగాణ మెలిక పెట్టింది. దీంతో ఆంధ్రప్రదేశ్ అధికారులు లక్ష కిలో మీటర్లు తగ్గించుకుంటామని సూచించారు. ఈ దశలోనే తెలంగాణ ఆర్టీసీ అధికారులు కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. విజయవాడ-హైదరాబాద్ రూట్లలో మాత్రమే బస్సులను తిప్పాలని మిగతా ప్రాంతాల్లో అవసరం లేదని కోరారు. దీంతో వివాదం ఇంకా ముదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

Advertisement