Advertisement

ఎల్ఆర్ఎస్ పిటిషన్ పై విచారించిన హై కోర్ట్

By: Sankar Thu, 17 Sept 2020 3:00 PM

ఎల్ఆర్ఎస్ పిటిషన్ పై విచారించిన హై కోర్ట్


అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎల్‌ఆర్‌ఎస్‌ అంశంపై ‘ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్’ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఎల్ఆర్‌ఎస్ పలు చట్టాలకు విరుద్ధంగా ఉందని పిటిషనర్ కోర్టుకు తన వాదన వినిపించాడు. తుది తీర్పునకు లోబడి ఉండేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్‌ కోర్టును కోరారు. అయితే ప్రభుత్వ వైఖరి తెలుసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 8కి వాయిదా వేసింది.

కాగా నిన్న అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ సవరణ ఉత్తర్వును ప్రభుత్వం నేడు జారీ చేసింది. క్రమబద్దీకరణ ఛార్జీలకు తాజా మార్కెట్‌ విలువను కాకుండా రిజిస్ట్రేషన్‌ సమయంలో ఉన్న మార్కెట్‌ విలువ ఆధారంగానే ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుంను వసూలు చేయనున్నారు. 2015 నాటి ఎల్‌ఆర్‌ఎస్‌ స్లాబ్‌లతో క్రమబద్దీకరణ రుసుంను వసూలు చేయనున్నారు.

చదరపు గజం మార్కెట్‌ ధర 3 వేల వరకు ఉంటే 20 శాతం, రూ.3,001 నుంచి రూ. 5 వేల వరకు 30 శాతం, రూ. 5001 నుంచి రూ. 10 వేల వరకు 40 శాతం, రూ. 10,001 నుంచి రూ. 20 వేల వరకు 50 శాతం, రూ. 20,001 నుంచి రూ. 30 వేల వరకు 60 శాతం, రూ. 30,001 నుంచి రూ. 50 వేల వరకు 80 శాతం, రూ. 50 వేలకు పైగా మార్కెట్‌ ధర ఉంటే వందశాతం క్రమబద్దీకరణ రుసుం వసూలు చేయనున్నారు. నాలా రుసుం కూడా క్రమబద్దీకరణ రుసుంలోనే ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

Tags :
|

Advertisement