Advertisement

విఆర్వో వ్యవస్థ ..ఉంచాలా...వద్దా ...?

By: Sankar Tue, 09 June 2020 1:54 PM

విఆర్వో వ్యవస్థ ..ఉంచాలా...వద్దా ...?


గ్రామ పాలన వ్యవస్థకు ప్రస్తుతం పట్టుగొమ్మగా ఉన్న గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. రెవెన్యూ వ్యవస్థను సమూలంగా సంస్కరించాలని భావిస్తోన్న ప్రభుత్వం.. కిందిస్థాయిలో కీలకమైన వీఆర్వో వ్యవస్థను రద్దుచేసే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఒకవేళ కొనసాగించినా, వారి విధుల్లో భారీగా కత్తెర పెట్టాలనే నిర్ణయానికి వచ్చింది.

వీఆర్వో వ్యవస్థను రద్దుచేస్తే వారి విధులను పంచాయతీరాజ్, వ్యవసాయశాఖలకు బదలాయించేలా ప్రాథమికంగా ప్రతిపాదనలు తయారుచేసింది. రెవెన్యూ, గ్రామ రికార్డుల నిర్వహణ బాధ్యతలను వ్యవసాయ విస్తరణాధికారులకు.. రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, పింఛన్ల పంపిణీ తదితరాలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించాలని యోచిస్తోంది. తహసీల్దార్ల అధికారాల్లో కోత ఆలోచనకు తగ్గట్టుగానే క్షేత్రస్థాయిలో వీఆర్వోల అధికారాలనూ కుదించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

vro,telangana,revenue,kcr,panchayithi raj ,రెవెన్యూ వ్యవస్థ, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులకు, రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు,


రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసి, అధికారుల విధుల్లో మార్పుచేర్పులు చేయడమేగాక కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్లు సీఎం కేసీఆర్‌ గతంలోనే ప్రకటించారు. భూరికార్డుల ప్రక్షాళన పూర్తయినా భూవివాదాలు సమసిపోకపోవడం, పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల జారీలో జాప్యం వంటి వాటికి కిందిస్థాయి అధికారుల చేతివాటమే కారణమని అంచనాకొచ్చిన సీఎం.. గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డుల సంరక్షకుడిగా పరిగణించే వీఆర్వోలతో ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందని శాసనసభ సాక్షిగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే వీఆర్వో వ్యవస్థ రద్దు కానుందనే ప్రచారానికి బలం చేకూరింది. దీనికి కొనసాగింపుగా.. వీఆర్వోలను కొనసాగిస్తే వారి వి«ధులెలా ఉండాలి? వేటిని ఇతర శాఖలకు బదలాయించాలి? కాలం చెల్లినవాటిలో వేటికి మంగళం పాడాలనే దానిపై రెవెన్యూశాఖ అంతర్గత ప్రతి పాదనలతో జాబ్‌చార్ట్‌ తయారుచేసింది. ఒకవేళ వీఆర్వో వ్యవస్థను రద్దుచేస్తే.. వారి విధులను పంచాయతీ కార్యదర్శులు, మండల వ్యవసాయ విస్తరణాధికారులకు బదలాయించే అంశాన్నీ పరిశీలిస్తోంది. దీనిపై సీఎం తీసుకునే నిర్ణయం మేరకు నడుచుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
భూరికార్డుల ప్రక్షాళనలో వీఆర్వోల భాగస్వామ్యంతో అక్రమాలు జరిగాయని అంచనాకొచ్చిన ప్రభుత్వం.. భూ రికార్డుల నిర్వహణ నుంచి వారిని పూర్తిగా తప్పించాలని నిర్ణయించింది. భూ రికార్డుల్లో కాస్తు కాలమ్‌ను తొలగించినందున, క్షేత్రస్థాయిలో వీరి అవసరం కూడా లేదనే భావనకొచ్చింది. అయితే, వీఆర్వో వ్యవస్థను పూర్తిస్థాయిలో రద్దుచేస్తే ఉద్యోగ సంఘాల ప్రతికూలత వస్తుందని భావిస్తున్న సర్కార్‌.. వీరి సేవలను వేరే విధంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. నైపుణ్యం ఉన్నవారిని రెవెన్యూలోనే కొనసాగించి.. ఇతరులను పూలింగ్‌లో పెట్టడం ద్వారా పంచాయతీరాజ్, వ్యవసాయశాఖల్లో విలీనంచేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవస్థను గనుక రద్దుచేస్తే క్వాలిఫైడ్‌ వీఆర్వోలను జూనియర్‌ అసిస్టెంట్లుగా నిర్వచిస్తూ ప్రస్తుత శాఖలోనే కొనసాగించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది.


Tags :
|
|

Advertisement