Advertisement

  • లాక్‌డౌన్‌ పై తెలంగాణ విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

లాక్‌డౌన్‌ పై తెలంగాణ విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

By: chandrasekar Wed, 01 July 2020 7:49 PM

లాక్‌డౌన్‌ పై తెలంగాణ విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు


రోజు రోజుకు తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నమోదయ్యే మొత్తం కేసుల్లో 70 శాత జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధించాలని యోచిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ఇది వరకే చెప్పిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారని త్వరలోనే కేబినెట్ సమావేశం పెట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఈ నేపథ్యంలో నగరంలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారన్న ప్రచారంపై తెలంగాణ విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్ అమలు పరిష్కారం కాదని సబిత ఇంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తే చిన్న కుటుంబాలు ఆర్థికంగా మరింత చితికిపోతాయని అన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాను కట్టడి చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి సబితారెడ్డి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, జూలై 2న తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్ విధించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 945 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇవాళ 1,712 మంది డిశ్చార్జి కాగా మరో ఏడుగురు మరణించారు. తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,339 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 7,294 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అవగా 260 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 8,785 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

Tags :

Advertisement