Advertisement

  • యాదాద్రి భువనగిరి జిల్లా వాసాల మర్రిని దత్తతు తీసుకున్న సీఎం కెసిఆర్

యాదాద్రి భువనగిరి జిల్లా వాసాల మర్రిని దత్తతు తీసుకున్న సీఎం కెసిఆర్

By: Sankar Mon, 02 Nov 2020 10:13 AM

యాదాద్రి  భువనగిరి జిల్లా వాసాల మర్రిని దత్తతు తీసుకున్న సీఎం కెసిఆర్


యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని, ఎర్రవల్లి తరహాలో అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్‌ ఆదివారం ప్రకటించారు. సీఎం శనివారం జనగామ జిల్లా కొడకండ్లకు రోడ్డుమార్గంలో వెళ్లి వస్తూ వాసాలమర్రిలో ఆగి గ్రామస్తులతో మాట్లాడిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా గ్రామ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో సర్పంచ్‌ను ఆదివారం ఫాంహౌస్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ మేరకు సర్పంచ్‌ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఎంపీపీ సుశీల, ఎంపీటీసీ సభ్యుడు నవీన్, కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు ఎర్రవల్లి ఫాంహౌస్‌లో సీఎంను కలిశారు. వినతిపత్రం ఇవ్వబోగా అవసరం లేదని, వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుని రూ.100 కోట్లు ఖర్చయినా అభివృద్ధి చేస్తానని సీఎం ప్రకటించారు.

వెంటనే జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌తో మాట్లాడి వాసాలమర్రిని ఎర్రవల్లి తరహాలో అభివృద్ధి చేయాలని, గ్రామానికి ఏమేం కావాలనే అంశాలపై బ్లూ ప్రింట్‌ తయారు చేయాలని ఆదేశించారు. గ్రామస్తులను ఎక్స్‌పోజర్‌ విజిట్‌ కోసం నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌కు తీసుకుపోవాలని ఆదేశించారు. మరో 10 రోజుల్లో ఊరుకు వచ్చి గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేస్తానని చెప్పారు. ఎర్రవల్లిని అభివృద్ధి చేసిన అప్పటి సిద్దిపేట, ప్రస్తుత సంగారెడ్డి కలెక్టర్‌ వెంకట్‌రామ్‌రెడ్డి, అటవీశాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌ శోభ, కలెక్టర్‌ అనితారామచంద్రన్, పలువురు అధికారులు సోమవారం వాసాలమర్రికి రానున్నారు

Tags :
|

Advertisement