Advertisement

  • కరోనా నిబంధనలతో నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

కరోనా నిబంధనలతో నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

By: Sankar Mon, 07 Sept 2020 08:51 AM

కరోనా నిబంధనలతో నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..


తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా విజృంభిస్తున్న పరిస్ధితుల్లో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సమావేశాలు నిర్వహించనున్నారు. అందుకోసం అసెంబ్లీ, మండలిలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఉభయ సభల్లో సభ్యులు 6 అడుగుల భౌతిక దూరం పాటించేలా.. అసెంబ్లీలో అదనంగా 40 సీట్లు, మండలిలో 8 సీట్లు కేటాయించారు. సభ్యులంతా విధిగా మాస్క్ ధరించాల్సిఉంటుంది. సమావేశాల ప్రారంభానికి ముందే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు.

ఇప్పటికే మంత్రి హరీష్ రావుకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. మరింత అప్రమత్తమైన అసెంబ్లీ అధికారులు సభ్యులందరికి పరీక్షలు చేసింది. నెగెటివ్ వచ్చిన మారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ప్రతి ఒక్కరు కరోనా పరీక్షలు చేయించుకుని నెగిటివ్‌ సర్టిఫికేట్‌ తీసుకుని అసెంబ్లీకి రావాలని స్పీకర్‌ సూచించారు. కరోనా దృష్ట్యా ఎమ్మెల్యేల వ్యక్తిగత సహాయకులు, గన్‌మెన్లకు అనుమతిని నిరాకరించారు.

శాసన మండలి సమావేశాలకు కూడా నిబంధనలు వర్తిస్తాయని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. రెండు రోజుల పాటు అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. మరోవైపు సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో పాటు మాజీ సభ్యుల మరణంపై సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. అనంతరం సభ వాయిదా పడ్డాక బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. వర్షకాల సమావేశాల్ని 20 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రతిపక్ష పార్టీలు ఎన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించాలని కోరితే అన్ని రోజులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. సీఎం కేసీఆర్‌ కూడా అర్ధవంతమైన చర్చల కోసం ఎన్నిరోజులు సమావేశాలు నిర్వహించడానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.

Tags :

Advertisement