Advertisement

జగన్‌ తరహాలో లోకేశ్‌ బాబు పాదయాత్ర

By: Dimple Tue, 25 Aug 2020 10:30 AM

జగన్‌ తరహాలో లోకేశ్‌ బాబు పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో వినూత్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశంపార్టీ నాయకులు జనాల్లోకి వెళ్లాలని బావిస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ జనాల్లోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. పాదయాత్ర.. కుదరని పక్షంలో సైకిల్ యాత్రా చేయాలని అనుకుంటున్నారా.. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇది. కొద్దిరోజులుగా లోకేష్ సైకిల్ యాత్ర చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది..

కొంతమంది ఒకడుగు ముందుకు వేసి పాదయాత్ర చేయబోతున్నారని చెబుతున్నారు. కేడర్‌ కాస్త డల్‌గా ఉంది.. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదాపడ్డాయి. అందుకే కార్యకర్తలు నేతల్లో ఉత్సాహం నింపుతూ అడుగులు ముందుకు వేయాలని భావిస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఇకపై జనాల్లోకి వెళ్లాలని లోకేష్ ఫిక్స్ అయ్యారని అందుకే యాత్ర ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారనే లాజిక్ వినిపిస్తున్నారు. అంతేకాదు ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తూ.. లోకేష్ ఈ మధ్య బాగా బరువు తగ్గారని పాదయాత్ర కోసమే ఆయన ఇలా సన్నబడ్డారనే ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 15న ఆయన జెండా ఆవిష్కరణ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో యాత్ర చేయబోతున్నారనే చర్చ మొదలైంది.
తెలుగు తమ్ముళ్ల కంటే ముందు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో దీనిపై చర్చ పెట్టారు. ఇక మీడియాలో కూడా లోకేష్ యాత్రపై జోరుగా చర్చ నడుస్తోంది. ఇటీవల వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌ చర్చనీయాంశమైంది. పార్టీ వ్యవహారాలను కొడుకుకు అప్పగించాలని బాబు గారు అనుకుంటున్నారా.. వయసు పెరగడం, జ్ఞాపకశక్తి క్షీణించడంతో కుమారుడికి పగ్గాలు ఇస్తారంట. కరోనా ఉధృతి తగ్గగానే లోకేశ్ నాయుడును ‘కాబోయే సీఎం'గా ఎలివేట్ చేసేలా సైకిల్ యాత్ర చేయించాలని ఎల్లో మీడియా ముఖ్యులు రూట్ మ్యాప్ ఇచ్చారంట అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వ్యవహారంపై ఆ పార్టీ కార్యకర్తలు జోరుగా ట్రోలింగ్స్ మొదలు పెట్టారు.

ఇదిలా ఉంటే మరో చర్చ జరుగుతోంది. పాద‌యాత్ర‌ను దృష్టిలో పెట్టుకునే లోకేష్ త‌న‌ బరువు త‌గ్గారట. ఇప్ప‌టి నుంచే పాద‌యాత్ర‌కు త‌న శరీరాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నారట. దాదాపు నాలుగువేల కిలోమీట‌ర్ల పాద‌యాత్ర‌కు ఆయన రెడీ అవుతున్నారనే పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. అయితే ఈ పాదయాత్ర ఇప్పట్లో లేదనే మరో వాదన వినిపిస్తోంది. జగన్ ప్ర‌భుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత త‌న పాద‌యాత్ర నారా లోకేష్ ప్రారంభించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ వ్యూహంతో వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ప్ర‌జ‌ల్లోనే ఉండొచ్చని భావిస్తున్నారట. అంతేకాదు జగన్ పాదయాత్ర రికార్డును బ్రేక్ చేసేందుకు 4 వేల కిలోమీట‌ర్ల పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్టిన‌ట్లు స‌మాచారం. అయితే పార్టీ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

లోకేష్ పాదయాత్ర చేస్తారా లేదా అన్న అంశాన్ని పక్కన పెడితే పార్టీకి మాత్రం పరిస్థితులు అనుకూలంగా లేవు. ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితం అయ్యాక.. పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. కొందరు అధికార పార్టీలో చేరిపోతే.. మరికొందరు బీజేపీగూటికి వెళ్లారు. మరికొందరు నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు.. కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కొంతమంది కేసుల్లో చిక్కుకుని ఇబ్బందుల్లో ఉన్నారు.. పార్టీ తరపున వాయిస్ వినిపిస్తున్న అచ్చెన్నాయుడు, జేసీ ఫ్యామిలీ, కొల్లు రవీంద్ర లాంటి వాళ్ల‌ు కేసుల్లో ఉన్నారు. ఇక కేడర్ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. దీనికి తోడు కరోనా ప్రభావంతో పార్టీ నిరసన కార్యక్రమాల విషయంలో జోరు తగ్గించింది. ఇలాంటి కష్ట సమయంలో ప్రజల్లో ఉండటమే మంచిదనే అభిప్రాయాలు టీడీపీ కేడర్‌లో ఉంది. మరి చూద్దాం లోకేష్ నిర్ణయం ఎలా ఉండబోతోందో.

Tags :
|
|

Advertisement