Advertisement

  • ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ రేసులో మల్టీనేషనల్ సంస్థ టాటా గ్రూప్

ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ రేసులో మల్టీనేషనల్ సంస్థ టాటా గ్రూప్

By: chandrasekar Sat, 15 Aug 2020 4:46 PM

ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ రేసులో మల్టీనేషనల్ సంస్థ టాటా గ్రూప్


ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ రేసులో మల్టీనేషనల్ సంస్థ టాటా గ్రూప్ కూడా నిలుస్తోంది. ఈ ఏడాది జరిగే ఐపీఎల్ టోర్నీకి టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తూ బీసీసీఐకి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ సమర్పించింది. దేశంలో చైనా ఉత్పత్తులను బ్యాన్ చేయాలన్న డిమాండ్ల నేపథ్యంలో టైటిల్ స్పాన్సర్ హోదా నుంచి వీవో తప్పుకోవడంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం వెతుకులాడుతుండటం తెలిసిందే. ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ అన్ అకాడమీ, డ్రీమ్11 కూడా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ కోసం టాటా గ్రూప్‌తో పోటీపడుతున్నాయి. టైటిల్ స్పాన్సర్ హోదా కోరుకునే బిడ్డర్లు తమ ఆసక్తి ని బీసీసీఐకి తెలియజేసేందుకు శుక్రవారంతో గడువు ముగియగా మొత్తం మూడు సంస్థలు టైటిల్ హక్కుల రేసు కోసం ఆసక్తిచూపుతున్నాయి. టాటా గ్రూప్ కూడా రేసులో నిలుస్తుండటంతో ఈ నెల 18న జరగనున్న బిడ్డింగ్ వార్ ఆసక్తిరేపుతోంది. ఇప్పటి వరకు వార్షిక టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కుల కోసం వీవో సంవత్సరానికి రూ.440 కోట్ల బీసీసీఐకి చెల్లిస్తూ వచ్చింది.

అయితే ఈ ఏడాది చివరి వరకు మాత్రమే టైటిల్ స్పాన్సర్ హక్కులు ఇస్తున్నా దీనికి మించిన ఆదాయం బీసీసీఐకి లభించే అవకాశముందని భావిస్తున్నారు. టాటా గ్రూప్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ హక్కుల కోసం సమర్పించినట్లు బీసీసీఐ అధికార ప్రతినిధి పీటీఐకి ధృవీకరించారు. యోగా గురువు బాబా రాందేవ్‌కు చెందిన పతాంజలి కూడా ఐపీఎల్ స్పాన్సర్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగినా ఆ సంస్థ సమర్పించినట్లు బీసీసీఐ అధికారులు ధృవీకరించలేదు. దీంతో ఆ సంస్థ స్పాన్సర్ రేసులో నుంచి తప్పుకున్నట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ ద్వారా రూ.300 కోట్ల నుంచి రూ.350 కోట్ల వరకు ఆదాయం సమకూరినా బీసీసీఐ సంతృప్తి చెందే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 19 నుంచి యునైటైడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుండగా ఫైనల్ మ్యాచ్ నవంబరు 10న నిర్వహించనున్నారు. టైటిల్ స్పాన్సర్ హక్కులు పొందే సంస్థకు నాలుగు మాసాల 13 రోజుల వరకు మాత్రమే ఈ హక్కులు ఉంటాయి.

Tags :
|

Advertisement