Advertisement

  • లాక్ డౌన్ తర్వాత ఈ రోజు తొలి సారి తెరుచుకున్న తాజ్ మహల్

లాక్ డౌన్ తర్వాత ఈ రోజు తొలి సారి తెరుచుకున్న తాజ్ మహల్

By: Sankar Mon, 21 Sept 2020 12:40 PM

లాక్ డౌన్ తర్వాత ఈ రోజు తొలి సారి తెరుచుకున్న తాజ్ మహల్


ఆగ్రాలోని తాజ్ మహల్ ఆరు నెలల తర్వాత ఇవాళ రీ ఓపెన్ అయ్యింది.. ఈరోజు నుంచి పర్యాటకులను అనుమతిస్తున్నారు. కరోనా విజృంభణ కారణంగా లాక్‌డౌన్‌కు ముందే మార్చి 17న తాజ్‌ను మూసేశారు. తాజ్ మహల్ చరిత్రలో ఇన్ని రోజులు మూసివేయడం ఇదే తొలిసారి. కరోనా కారణంగా పర్యాటకుల కోసం శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. అయితే, రోజుకి గరిష్ఠంగా 5 వేల మంది టూరిస్టులను మాత్రమే అనుమతిస్తారు. ప్రపంచంలోని అత్యంత పర్యటక ప్రాంతాల్లో ఒకటైన తాజ్‌ మహల్‌కు కరోనాకు ముందు రోజుకు 70 వేల మంది సందర్శకులు వస్తుండేవారు. కొన్ని సమయాల్లో ఈ సంఖ్య మరింత పెరిగేది..

గతంలో 1978లో ఆగ్రాలో వరదలు వచ్చినప్పుడు ఒకసారి తాజ్ సందర్శన రద్దు చేశారు. అంతకు ముందు 1971లో పాకిస్తాన్‌ - భారత్ యుద్ధ సమయంలోనూ స్వల్పకాలం మూసివేశారు. కానీ, ఇంత సుదీర్ఘకాలం మూతపడడం మాత్రం ఇదే తొలిసారి. ఇక, తాజ్ మహల్‌ సందర్శనకు టూరిస్టులను అనుమతిస్తున్నప్పటికీ... గ్రూప్ ఫొటోలు తీసుకునేందుకు అనుమతించడం లేదు. తాజ్ లోపల విజిటర్లు.. ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. లైసెన్స్ పొందిన టూర్ గైడ్స్ ను మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు.

ఇక్కడి అధికారులు, సిబ్బంది మాస్కులు ధరించి సందర్శకులకు సహకరిస్తారు. పర్యటకులకు టెంపరేచర్ చెక్ చేస్తారు. గ్రూప్ ఫోటోలకు అనుమతి లేనప్పటికీ.. సెల్ఫీలు తీసుకోవచ్చు. మరోవైపు, సందర్శనకు వచ్చే పర్యాటకులు ముందుగానే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. స్వదేశీ పర్యాటకులు రూ. 50, విదేశీ పర్యాటకులు అయితే రూ.1,100 ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Tags :
|

Advertisement