Advertisement

నిరసనను ఉదృతం చేసిన స్విగ్గి డెలివరీ బాయ్స్

By: Sankar Tue, 22 Sept 2020 3:48 PM

నిరసనను ఉదృతం చేసిన స్విగ్గి డెలివరీ బాయ్స్


మాదాపూర్ కాకతీయ హిల్స్ గ్రౌండ్‌లో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన స్విగ్గికి చెందిన డెలివరీ బాయ్స్ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారంతా కలిసి మోకాళ్లపై నిలబడి నిరసన తెలుపుతున్నారు. యాజమాన్యం తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేస్తున్నారు. గత ఎనిమిది రోజులుగా ఈ ఆందోళన కొనసాగుతోంది. బేస్ పే, అలెవెన్సు, ఇన్సెంటివ్‌లను పాత పద్ధతిలో మాత్రమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

డెలివరీ బాయ్స్‌కు గతంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం వచ్చేది. ఇప్పుడు తగ్గించిన కమీషన్లతో రూ.10 వేలు కూడా రావడం కష్టంగా ఉందని చెబుతున్నారు. రోజంతా కష్టపడినా రూ.400లు కంటే ఎక్కువ రావట్లేదని, ఇందులో రూ.200 వరకూ బైక్‌లో ఇంధనానికే ఖర్చవుతోందని డెలివరీ బాయ్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా యాజమాన్యం ఎలాంటి హామీ ఇవ్వలేదని బాయ్స్‌ ఆందోళన చేస్తున్నారు. తమను మోసం చేస్తున్న కంపెనీపై కార్మిక చట్టం ప్రకారం, చర్యలు తీసుకోవాలని ఐటీ ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌కు వినతి పత్రం సమర్పించినట్టు వారు తెలిపారు.

కాగా స్విగ్గీ కంపెనీలో నగర వ్యాప్తంగా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ పార్టనర్స్‌తో కలిపి వేల మంది పని చేస్తున్నారు. వీరికి గతంలో నాలుగు కిలో మీటర్ల పరిధిలోపు ఒక డెలివరీ ఐటమ్‌కు రూ.35 కమీషన్‌ వచ్చేది. కానీ, ప్రస్తుతం ఒక కిలోమీటర్‌ పరిధిలోపు డెలివరీ చేస్తే కేవలం రూ.6 మాత్రమే కమీషన్ ఇస్తోందని బాయ్స్‌ ఆందోళన చేస్తున్నారు.

Tags :
|

Advertisement