Advertisement

  • కేసీఆర్, కేటీఆర్పై స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు..

కేసీఆర్, కేటీఆర్పై స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు..

By: chandrasekar Mon, 31 Aug 2020 3:24 PM

కేసీఆర్, కేటీఆర్పై స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు..


టీఆర్‌ఎస్‌ అధిష్ఠానంపై స్వామిగౌడ్‌ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించడం గులాబీ నేతలను విస్మయానికి గురి చేసింది. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ వ్యవహరిస్తున్న తీరు ఇటీవల పార్టీని వర్గాలను ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల వివిధ సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లోనే కాక, రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో ఆదివారం స్వామిగౌడ్ ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ అధిష్ఠానంపై స్వామిగౌడ్‌ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో ఉద్యమకారులను కలుపుకుని పోవడంలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తమను చూసి నవ్విన వారికి ఇప్పుడు ప్రభుత్వంలో మంచి గుర్తింపు లభించిందని మొహమాటం లేకుండా వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ సమయంలో వెంటే ఉండి నడిచిన వారిని దూరం పెడితే ఎలా అని ప్రశ్నించారు. గతకొంత కాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోసం ఎంత ప్రయత్నిస్తున్నా వారు ఇవ్వడంలేదని పేర్కొన్నారు.

కానీ, పార్టీ మారే ఆలోచన ఏమైనా ఉందా అని ప్రశ్నించగా.. ప్రస్తుతం ఆ ఆలోచనేమీ లేదని తెలియ చేశారు. ఉద్యమకారులను, బడుగు బలహీన వర్గాలను అధిష్ఠానం కూర్చోబెట్టి మాట్లాడాలని కోరారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చేవెళ్ల ఎంపీ టికెట్‌ తనకు ఇస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారని స్వామి గౌడ్ గుర్తు చేశారు. కానీ తన స్థానంలో మరొకరికి టికెట్‌ ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు. స్వామి గౌడ్ పార్టీ అధిష్ఠానం పట్ల అసంతృప్తి ప్రదర్శించడానికి పలు కారణాలు లేకపోలేదు. గతేడాది ఏప్రిల్‌లో ఎమ్మెల్సీగా, మండలి చైర్మన్‌గా ఆయన పదవీ కాలం పూర్తయింది. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో అంతగా కనిపించట్లేదు. గతంలో గవర్నర్‌ కోటాలోనే ఆయన శాసనమండలికి ఎన్నికయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్‌ స్థానం నుంచి పోటీ చేయాలని ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ చేవెళ్ల నుంచి పోటీ చేయాలని చూశారు. ఇక్కడ కూడా పార్టీ నుంచి ఆయనకు మొండి చెయ్యే ఎదురైంది. పార్టీ అధిష్ఠానం నుంచి సరైన స్పందన లేకపోవడంతో స్వామిగౌడ్‌ అసంతృప్తితో ఉన్నారు.

Tags :
|

Advertisement