Advertisement

  • సూర్యకుమార్ తన సత్తా ఏంటో కొహ్లీకి చూపించాడు...

సూర్యకుమార్ తన సత్తా ఏంటో కొహ్లీకి చూపించాడు...

By: chandrasekar Sat, 31 Oct 2020 1:40 PM

సూర్యకుమార్ తన సత్తా ఏంటో కొహ్లీకి చూపించాడు...


విరాట్ కొహ్లీ ముంబై యంగ్ ప్లేయర్ సూర్యకుమార్‌ని స్లెడ్జింగ్ చేసిన ఘటనపై దుమారం రేగుతోంది. భారత జట్టుకు కెప్టెన్‌ గా ఉండి యువ ఆటగాడి పట్ల ఇలా ప్రవర్తిస్తావా అంటూ, కొహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తిగతంగా బాగా మంచి బ్యాట్స్‌మెన్ ఐనప్పటికీ.. కెప్టెన్సీకి కొహ్లీ పనికి రాడని.. నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ స్పందించారు. సూర్యకుమార్ తన సత్తా ఏంటో కొహ్లీకి చూపించాడని.. అతడు ఎవరికీ భయపడే రకం కాదని అన్నారు. భవిష్యత్‌లో టీమిండియాలో సూర్యకు చోటు దక్కుతుందని చెప్పారు వీరేంద్ర సెహ్వాగ్. ''అది అద్భుతమైన మ్యాచ్. సూర్యకుమార్‌ ఇన్నింగ్స్‌ అసాధారణం. తన సత్తా ఏమిటో కొహ్లీకి చూపించాడు. ఆస్ట్రేలియా టూర్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎంపిక చేయకున్నా పట్టించుకోలేదు. తనదైన ఆటతో అదరగొట్టాడు. కోహ్లీ ఉన్న స్థానంలోకి సూర్యకుమార్ షాట్ ఆడాడు. బంతి అందుకున్న కొహ్లీ అతడిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. సూర్యను చూస్తూ దగ్గరకు వెళ్లి కవ్వించాడు. కానీ తాను భయపడే రకాన్ని కాదని సూర్యకుమార్ తనదైన శైలిలో చెప్పాడు. భవిష్యత్‌లో ఖచ్చితంగా భారత జట్టులో అవకాశం వస్తుంది.'' అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు.

ఇటీవల జరిగిన బెంగళూరు, ముంబై మ్యాచ్‌లో సూర్యకుమార్‌ను కొహ్లీ సెడ్జింగ్ చేసిన విషయం తెలిసిందే. 13వ ఓవర్‌ పూర్తయ్యాక సూర్యకుమార్‌ యాదవ్‌ వైపు చూస్తూ విరాట్ కొహ్లీ ముందుకెళ్లాడు. సూర్య కూడా అలాగే చూశాడు. సూర్య వెనకకు వెళ్లిన కొహ్లీ.. బంతిని రుద్దుతూ సూర్యకుమార్ వైపు కోపంగా చూశాడు. కొహ్లీ స్లెడ్జింగ్ చేసినా అతడు పట్టించుకోలేదు. అక్కడి నుంచి నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు వెళ్లిపోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 43 బంతుల్లో 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 3 సిక్స్‌లు 10 ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌ల్లో బెంగళూరు విధించిన 165 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో చేధించింది ముంబై ఇండియన్స్. 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం.. సూర్యకుమార్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. సూర్య ఇన్నింగ్స్.. బీసీసీఐకి చెప్పుదెబ్బ లాంటిందని.. ఇప్పటికైనా అతడిని జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్..362 పరుగులు చేశాడు. అందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. త్వరలోనే సూర్యకుమార్ యాదవ్‌ను టీమిండియాలో చూస్తామని ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ కీరన్ పొలార్డ్ అభిప్రాయపడ్డాడు.

Tags :
|

Advertisement