Advertisement

ట్రంప్ కు చెమటలు పట్టిస్తున్న సర్వేలు

By: Sankar Tue, 22 Sept 2020 08:37 AM

ట్రంప్ కు చెమటలు పట్టిస్తున్న సర్వేలు

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఓ వైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మాజీ ఉపాధ్యక్షుడు బైడెన్... తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అయితే కరోనా నివారణలో ట్రంప్ విఫలమయ్యారని భావిస్తున్న అధికశాతం మంది అమెరికన్లు.. ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటు వేయనున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల్లో స్వింగ్ స్టేట్స్ ఓట్లు కీలకమని నిపుణులు చెబుతున్నారు.

ఈ ఎన్నికల్లో స్వింగ్ స్టేట్స్‌లో మొత్తంగా చూస్తే మాజీ ఉపాధ్యక్షుడు బైడెన్‌ 45 నుంచి 51 శాతం ఆధిక్యంలో ఉన్నట్టు సీబీఎస్‌ సర్వే తేల్చింది. ఎన్‌బీసీ న్యూస్‌, వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ల జాతీయ స్థాయి సంయుక్త సర్వేలో ట్రంప్‌ కంటే బైడెన్‌ 51 నుంచి 43 శాతం ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నట్టు తెలిసింది. నల్ల జాతీయులలో ఏకంగా 90 శాతం మంది బైడెన్‌ పక్షాన ఉన్నట్టు ఈ సర్వే తెలిపింది. ఇక మహిళల్లో 57 శాతం, పట్టభద్రులైన శ్వేత జాతీయుల్లో 54 శాతం ఆయనే తమ అధ్యక్ష అభ్యర్థి అని స్పష్టం చేశారు.

డొనాల్డ్‌ ట్రంప్‌ కు మద్దతుగా ఉండే పట్టభద్రులు కాని శ్వేత జాతీయులు 59 శాతం ఉన్నారు. శ్వేత జాతి ఓటర్లలో 52 శాతం, మొత్తం పురుషుల్లో 50 శాతం ట్రంప్‌ వైపు మొగ్గు చూపిస్తున్నారు. అయితే అధ్యక్ష ఎన్నికల్లో గెలవటానికి అవసరమయ్యే 270 ఎలక్ట్రోరల్‌ ఓట్లలో 29 ఓట్లను అందించే ఫ్లోరిడాలో గెలిచిన వారినే అధ్యక్ష పదవి వరించే అవకాశం ఎక్కువని పరిశీలకులు చెబుతున్నారు. ఏదేమైనా కరోనా సమయంలో వస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఆ ప్రభావం స్పష్టంగా కనబడే అవకాశం ఉందంటున్నారు.



Tags :

Advertisement