Advertisement

  • టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన పై స్టీవ్ వా కీలక వ్యాఖ్యలు

టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన పై స్టీవ్ వా కీలక వ్యాఖ్యలు

By: chandrasekar Sat, 07 Nov 2020 4:03 PM

టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన పై  స్టీవ్ వా కీలక వ్యాఖ్యలు


ఐపీల్ తరువాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన పై స్టీవ్ వా కీలక వ్యాఖ్యలుచేశారు. ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముగిసిన వెంటనే భారత జట్టు నాలుగు టెస్టుల మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ వద్ద స్లెడ్జింగ్ లాంటి పప్పులుడకవని తేల్చి చెప్పాడు. గత సిరీస్‌లోనూ ఆసీస్ జట్టు స్లెడ్జింగ్‌కు పాల్పడింది. అయినప్పటికీ భారత జట్టు తొలిసారి ఆస్ట్రేలియాను మట్టికరిపించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. భారత ఆటగాళ్లతో మాటల యుద్ధానికి దిగడమంటే ఆ జట్టు మరిన్ని పరుగులు చేసేలా ప్రోత్సహించడమే అవుతుందని స్టీవ్ వా అభిప్రాయపడ్డాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టు డిసెంబరు 17 నుంచి 21 వరకు జరగనుంది. ఈ మ్యాచ్‌కు అడిలైడ్ ఓవల్ మైదానం వేదిక కానుంది. ఆ తర్వాత 26 నుంచి రెండో టెస్టు మెల్‌బోర్న్‌లో, మూడో టెస్టు జనవరి 7 నుంచి సిడ్నీ గ్రౌండ్స్‌లో, చివరి టెస్టు జనవరి 15 నుంచి గబ్బాలో ప్రారంభం కానుంది.

స్టీవ్ వా మాట్లాడుతూ విరాట్ కోహ్లీ లాంటి గొప్ప ఆటగాళ్లపై స్లెడ్జింగ్ ఎలాంటి ప్రభావమూ చూపబోదన్నాడు. కాబట్టి వారిని ఒంటరిగా వదిలేయడమే మంచిదని ఆసీస్ ఆటగాళ్లకు సూచించాడు. బాల్ ట్యాంపరింగ్‌ వివాదంలో నిషేధం కారణంగా గత సిరీస్‌లో ఆసీస్ జట్టుకు స్టీవ్ స్మిత్ దూరమయ్యాడు. 2016-17 ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించినప్పుడు స్మిత్ అత్యద్భుత ప్రదర్శన కనబరిచాడు. కాబట్టి, ఈసారి అతడికంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని కోహ్లీ లక్ష్యంగా పెట్టుకుంటాడని వా పేర్కొన్నాడు. కోహ్లీ వరల్డ్ క్లాస్ ఆటగాడు. ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించిన గత సిరీస్‌లో కోహ్లీ, స్మిత్ హోరాహోరీగా తలపడ్డారు. స్మిత్ మూడు సెంచరీలు చేయగా, కోహ్లీ అంతగా రాణించలేకపోయాడు అని స్టీవ్ వా గుర్తు చేశాడు. కాబట్టి ఈసారి స్మిత్ కంటే బాగా రాణించాలని కోహ్లీ గట్టి పట్టుదలతో ఉంటాడని పేర్కొన్నాడు. కాగా, ఆస్ట్రేలియాలో భారత పర్యటన మూడు వన్డేల సిరీస్‌తో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత మూడు టీ20ల్లో ఇరు జట్లు తలపడతాయి. అనంతరం టెస్టు సిరీస్ ప్రారంభం అవుతుంది.

Tags :
|
|

Advertisement