Advertisement

  • గృహ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం అసాధారణ రాయితీ...

గృహ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం అసాధారణ రాయితీ...

By: chandrasekar Mon, 16 Nov 2020 12:11 PM

గృహ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం అసాధారణ రాయితీ...


హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు, 140 మున్సిపాలిటీల్లో గృహ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం అసాధారణ రాయితీ ప్రకటించింది. 2020-21 సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను చెల్లింపులో 50 శాతం రాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకూ దీపావళి కానుక ప్రకటించింది. రూ.14,500 ఉన్న వారి వేతనాలను రూ.17,500కు పెంచింది. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా ప్రజల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అసాధారణ నిర్ణయం తీసుకున్నారని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజల ఆర్థిక స్థితిగతులపై శుక్రవారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్రప్రజలకు ప్రత్యేకించి నగరాలు, పట్టణాల్లో ఆర్థికఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజల కష్టాల్లో భాగం పంచుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ర్ట పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ శనివారం మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌అలీ, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, రాష్ర్ట పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ ఇతర అధికారులతో సమీక్షించారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మంత్రి కేటీఆర్‌ మీడియాకు వెల్లడించారు.

ప్రతి ఒక్క వరద బాధితుడినీ ఆదుకుంటాం...

జీహెచ్‌ఎంసీ పరిధిలో అసాధారణ రీతిలో వర్షాలు, వరదలు వచ్చాయని, రాష్ర్టప్రభుత్వం అంతేస్థాయిలో సహాయచర్యలు చేపట్టిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వర్షాలు కురుస్తున్నా సహాయచర్యలకు ఆటంకం కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో బాధితులకు అత్యవసరంగా నిత్యావసర కిట్లను అందజేశామని తెలిపారు. వరదల్లో సరుకులు కొట్టుకుపోయిన వారికి తక్షణ సహాయమందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ యుద్ధప్రాతిపదికన రూ.550 కోట్లు విడుదల చేశారని పేర్కొన్నా రు. బాధిత కుటుంబానికి పదివేల చొప్పున 4,75, 871 కుటుంబాలకు రూ.475 కోట్ల పైచిలుకు పంపిణీ చేశామని వివరించారు. దసరా పండుగనాడు కూడా చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌, మున్పిపల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ నేతృత్వంలోని 920 బృం దాలు సహాయాన్ని పంపిణీ చేశాయని వివరించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో అక్కడక్కడా సహాయం అందలేదంటూ వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్నామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ప్రభుత్వం నుంచి ఇంకా సహాయం అందలేదని భావిస్తున్న నిజమైన బాధితులు మీ-సేవ కేంద్రాల ద్వారా వివరాలు తెలియజేస్తే క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి సహాయం అందజేస్తారని ప్రకటించారు. అవసరమైతే మరో వందకోట్లు అయినా విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బాధితుడి పేరు, ఇంటి నంబర్‌, ప్రాంతం, మొబైల్‌ నంబర్‌, ఆధార్‌కార్డు, పిన్‌కోడ్‌ తదితర వివరాలతో బాధితులు మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

50 శాతం రాయితీ...

రాష్ర్టవ్యాప్తంగా ఆస్తిపన్ను చెల్లిస్తున్న గృహ యజమానులకు ముఖ్యమంత్రి దీపావళి కానుక ప్రకటించారని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.15 వేలు, ఇతర మున్సిపాలిటీల్లో రూ.10 వేలలోపు పన్ను చెల్లించే గృహ యజమానులకు 50 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ రాయితీ వర్తిస్తుందని.. ఒకవేళ ఇప్పటికే చెల్లించినవారికి వచ్చే ఏడాదిలో సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉంటుందని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 13.72 లక్షల కుటుంబాలు, ఇతర పట్టణాల్లో 17.68 లక్షల కుటుంబాలకు దీనిద్వారా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆదాయం సుమారు రూ. 326.48 కోట్ల మేర తగ్గుతున్నప్పటికీ.. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వ ఇబ్బందులుగా స్వీకరించిన సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

Tags :
|

Advertisement