Advertisement

  • స్టార్ స్రైకర్ లియోనల్ మెస్సీ బార్సిలోనాకు వీడ్కోలు పలికేందుకు సిద్ధ౦

స్టార్ స్రైకర్ లియోనల్ మెస్సీ బార్సిలోనాకు వీడ్కోలు పలికేందుకు సిద్ధ౦

By: chandrasekar Thu, 27 Aug 2020 6:36 PM

స్టార్  స్రైకర్  లియోనల్  మెస్సీ  బార్సిలోనాకు  వీడ్కోలు పలికేందుకు సిద్ధ౦


ప్రపంచంలో ప్రముఖ ఫుట్‌బాల్‌ క్లబ్‌గా పేరొందిన బార్సిలోనాకు స్టార్‌ స్రైకర్‌ లియోనల్‌ మెస్సీ వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యాడు. బార్సిలోనాతో తన సుదీర్ఘ అనుబంధానికి త్వరలో ముగింపు పలుకబోతున్నాడు. ఈ మేరకు తన నిర్ణయాన్ని క్లబ్‌కు ఇప్పటికే తెలియజేశాడు. 16 ఏండ్ల ప్రాయంలో బార్సిలోనా తరఫున అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన మెస్సీ మరో క్లబ్‌కు మారబోతున్నాడు. 2003లో తొలిసారి బార్సిలోనాకు ఆడిన ఈ మేటి స్ట్రైకర్‌ లెక్కకు మించి టైటిళ్లు సాధించాడు.

ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో బార్సిలోనాకు 34 టైటిళ్లు అందించిన మెస్సీ 2019-2020 సీజన్‌లోనూ అదరగొట్టాడు. లాలీగా చాంపియన్‌షిప్‌లో 25 గోల్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అయితే మెస్సీ మెరిసినా..బార్సిలోనా అనుకున్న రీతిలో విజయాలు సాధించలేకపోయింది. జట్టులో అన్నీతానై మెస్సీ ముందుండి నిడిపిస్తే సహచరుల నుంచి సహకారం కరువైంది. దీంతో 2007 తర్వాత తొలిసారిగా ఒక్క టైటిల్‌ కూడా లేకుండా బార్సిలోనా ఈ సీజన్‌ను ముగించింది. ప్రత్యర్థులను నిలువరించే క్రమంలో మెస్సీ ఎన్ని రకాలుగా మాయ చేసినా..కోచ్‌, సహచర ఆటగాళ్ల విఫల ప్రదర్శన జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపించింది. దీనికి తోడు డైరెక్టర్ల నియామకంలోనూ అనాలోచిత నిర్ణయాలు బార్సిలోనా పరువును గంగలో కలిపాయి.

సరిగ్గా 12 రోజుల క్రితం చాంపియన్స్‌ లీగ్‌లో భాగంగా జర్మనీ క్లబ్‌ బయర్న్‌ మూనిక్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో బార్సిలోనా 2-8 తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూసింది. క్లబ్‌ సుదీర్ఘ చరిత్రలో భారీ ఓటమిని చవిచూసిన బార్సిలోనా.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. బయర్న్‌తో మ్యాచ్‌లో మెస్సీ ఆకట్టుకున్నా స్థాయికి తగ్గ ఆటతీరును కనబరుచడంలో సహచరులు విఫలం కావడం బార్సిలోనా ఓటమికి కారణమైంది. అప్పటి నుంచి జట్టు వ్యవహార శైలిపై పెదవివిప్పని మెస్సీ..బార్సిలోనాను త్వరలోనే వీడుతున్నాడన్న వార్తలు వెల్లువెత్తాయి. తమ అభిమాన ఆటగాడు దూరమవుతాడన్న ఊహాగానాల నేపథ్యంలో బార్సిలోనా పెద్దల వైఖరిపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే సీజన్‌ను పేలవంగా ముగించిన బార్సిలోనా దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఆరు నెలలు గడువకముందే చీఫ్‌ కోచ్‌ క్వీకి సీటెన్‌తో పాటు డైరెక్టర్‌ ఎరిక్‌ అబ్దెల్‌పై వేటు వేసింది. అయితే బార్సిలోనాకు వీరాభిమాని అయిన రోనాల్డ్‌ కోమన్‌ను కొత్త కోచ్‌గా నియమించింది. వచ్చీ రావడంతోనే తన ప్రాధామ్యాలేంటో స్పష్టం చేసిన కోమన్ గత వారం మెస్సీతో భేటీ అయ్యాడు. ఇదిలా ఉంటే జట్టును కోమన్‌ తీర్చిదిద్దేవరకు తాను ఉండలేనంటూ ఉద్దేశాన్ని బయటపెట్టిన మెస్సీ..ఇప్పటికే వీడ్కోలు పత్రాలను బార్సిలోనాకు పంపాడు. మెస్సీ వీడ్కోలు నేపథ్యంలో బుధవారం క్లబ్‌ బోర్డు బుధవారం భేటీ కాబోతుందంటూ స్పానిష్‌ మీడియా వార్తసంస్థలు తెలిపాయి.

ఇదిలా ఉంటే మెస్సీ కెరీర్‌ బార్సిలోనాతోనే ముగిస్తాడని క్లబ్‌ అధ్యక్షుడు జోసెఫ్‌ మారియా బార్టెమో ఆశాభావం వ్యక్తం చేశాడు. మెస్సీ కాంట్రాక్టు గడువు జూన్‌లో ముగిసిందని క్లబ్‌ వర్గాలు తెలిపాయి. బార్సిలోనాను వీడేందుకు సిద్ధమైన మెస్సీ ఏ క్లబ్‌కు ఆడుతాడన్నది ఆసక్తికరంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటగాడిగా కొనసాగుతున్న మెస్సీని కండ్లు చెదిరే మొత్తానికి సొంతం చేసుకునేందుకు ప్రముఖ క్లబ్‌లు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. పారిస్‌ సెయింట్‌ జర్మైన్‌, మాంచెస్టర్‌ సిటీ లాంటి క్లబ్‌లలో ఏదో ఒక దానితో మెస్సీ ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Tags :
|

Advertisement