Advertisement

  • ఆల్‌రౌండర్ షోతో అదరగొట్టిన సన్‌రైజర్స్...బ్యాటింగ్‌లో ఓపెనర్ల విధ్వంసం

ఆల్‌రౌండర్ షోతో అదరగొట్టిన సన్‌రైజర్స్...బ్యాటింగ్‌లో ఓపెనర్ల విధ్వంసం

By: chandrasekar Fri, 09 Oct 2020 12:24 PM

ఆల్‌రౌండర్ షోతో అదరగొట్టిన సన్‌రైజర్స్...బ్యాటింగ్‌లో ఓపెనర్ల విధ్వంసం


దుబాయ్ వేదికగా జరిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌, సన్‌రైజర్స్ తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 6 వికెట్ల నష్టానికి 201 రన్స్ చేయగా బదులుగా పంజాబ్ 132 పరుగులకే ఆలౌటయ్యింది. బ్యాటింగ్‌లో ఓపెనర్ల విధ్వంసం. బౌలింగ్‌లో రషీద్ మాయాజాలంతో ఆరెంజ్ ఆర్మీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా ఓపెనర్లు వార్నర్, బెయిర్ స్టో అదరగొట్టారు. తొలి వికెట్‌కు ఏకంగా 160 రన్స్ జోడించారు. వార్నర్ బెయిర్ స్టో జంట ఐపీఎల్‌లో ఐదో శతక భాగస్వామ్యం నమోదు చేసింది. వీరి దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి పంజాబ్ బౌలర్లు కష్టపడ్చాల్సి వచ్చింది. 40 బంతుల్లో 52 రన్స్ చేసిన వార్నర్ 55 బంతుల్లో 97 రన్స్ చేసిన బెయిర్‌స్టోలను స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చడంతో పంజాబ్ ఊపిరి పీల్చుకుంది.

పంజాబ్‌పై వార్నర్ వరుసగా 8 మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు నమోదు చేయడం విశేషం. ఓపెనర్లు ఔటైన తర్వాత ఆఖరి ఓవర్లలో బ్యాట్స్‌మెన్ తడబడటంతో.. సన్‌రైజర్స్ 201 పరుగులకే పరిమితమైంది. భారీ లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్.. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. నికోలస్ పూరన్ ఒంటరి పోరాటం చేశాడు. 17 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పూరన్.. ఈ ఐపీఎల్ సీజన్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఐపీఎల్‌లో పూరన్‌కు ఇదే తొలి అర్ధ శతకం కావడం విశేషం. అబ్దుల్ సమద్‌ను టార్గెట్ చేసుకున్న పూరన్ వరుసగా 6, 4, 6, 6, 6 బాదాడు. దీంతో ఆ ఓవర్లో 28 రన్స్ వచ్చాయి.

రషీద్ ఖాన్‌ బౌలింగ్‌ను ఓపికగా ఎదుర్కొన్న పూరన్ ఆఖరికి అతడి బౌలింగ్‌లోనే ఔటవడంతో పంజాబ్ ఓటమి ఖాయమైంది. 126 పరుగుల వద్ద పూరన్ ఔటయ్యాక తర్వాతి బంతికే షమీని రషీద్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చగా నటరాజన్ మిగతా ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ చేర్చడంతో పంజాబ్ 132 పరుగులకు ఆలౌటయ్యింది. 69 రన్స్ తేడాతో గెలిచిన సన్‌రైజర్స్‌కు ఐపీఎల్‌లో ఇది మూడో అతిపెద్ద విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 4 ఓవర్లలో 12 రన్స్ మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీయగా నటరాజన్, ఖలీల్ అహ్మద్ తలో రెండు వికెట్లు తీశారు. కీలకమైన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టింది. మయాంక్ అగర్వాల్‌ను వార్నర్‌ రెండో ఓవర్లోనే రనౌట్ చేయగా కీలక దశలో మ్యాక్స్‌వెల్‌ను ప్రియమ్ గార్గ్ డైరెక్ట్ త్రో ద్వారా రనౌట్ చేశాడు. 200కిపైగా పరుగులు చేయడం భారీ తేడాతో గెలుపొందడంతో మెరుగైన నెట్ రన్ రేట్ సాయంతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.

Tags :

Advertisement