Advertisement

  • ఢిల్లీ క్యాపిటల్స్‌తో 3 కీలక వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ రషీద్ ఖాన్

ఢిల్లీ క్యాపిటల్స్‌తో 3 కీలక వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ రషీద్ ఖాన్

By: chandrasekar Wed, 30 Sept 2020 5:36 PM

ఢిల్లీ క్యాపిటల్స్‌తో 3 కీలక వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ రషీద్ ఖాన్


ఢిల్లీ క్యాపిటల్స్‌తో అబుదాబి వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 3 కీలక వికెట్లు పడగొట్టిన రషీద్ ఖాన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఊహించని విజయాన్ని అందించాడు. మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా.. ఛేదనలో ఢిల్లీ 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులే చేసింది. మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి కేవలం 14 పరుగులిచ్చిన రషీద్ ఖాన్ ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, హిట్టర్ రిషబ్ పంత్ వికెట్లను పడగొట్టినందున మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 163 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీకి మెరుగైన ఆరంభం లభించలేదు. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ పృథ్వీ షా తొలి ఓవర్‌లోనే ఔటవగా.. మరో ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆశించినంత వేగంగా ఆడలేకపోయారు. దాంతో.. 10 ఓవర్లు ముగిసే సమయానికే బంతులు, పరుగుల మధ్య అంతరం భారీగా పెరిగిపోయింది. దాంతో.. ధావన్‌లోనూ ఒత్తిడికి కనిపించింది.

ఫస్ట్ శ్రేయాస్ అయ్యర్‌ని ఊరించి బోల్తా కొట్టించిన రషీద్ ఖాన్.. ఆ తర్వాత కొద్దిసేపటికే శిఖర్ ధావన్‌ని కూడా టెంప్ట్ చేసి బుట్టలో వేశాడు. అయితే.. కాసేపు హిట్‌మెయర్‌తో కలిసి హిట్టింగ్ చేసిన రిషబ్ పంత్.. ఢిల్లీ శిబిరంలో గెలుపు ఆశలు రేపాడు. కానీ.. రషీద్ ఖాన్ రాకతో అతని ఇన్నింగ్స్‌కి తెరపడింది. మొత్తంగా రషీద్‌తో పాటు భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, నటరాజన్‌ని మ్యాచ్‌ గమనానికి అనుగుణంగా హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ వినియోగించుకున్నాడు. గత 10 రోజుల నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఆఖరిగా గెలుపు బోణి అందుకున్న జట్టు హైదరాబాద్. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టులో ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో అతి జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ మిడిలార్డర్ చేతులెత్తేయడంతో.. వికెట్ కాపాడుకునేందుకు మొదటి ప్రాధాన్యత ఇచ్చిన ఈ జోడీ.. 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అయితే.. మిశ్రా బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్ కోసం ప్రయత్నిస్తూ వార్నర్ ఔటవగా.. ఆ తర్వాత వచ్చిన మనీశ్ పాండే నిరాశపరిచాడు. కానీ.. తాజాగా సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన కేన్ విలియమ్సన్ విలువైన పరుగులు చేశాడు. ముఖ్యంగా.. స్లాగ్ ఓవర్లలో అతను చేసిన పరుగులే హైదరాబాద్‌కి గౌరవప్రదమైన స్కోరుని అందించాయి. ఇక ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడిన అబ్దుల్ సమద్ కూడా 7 బంతుల్లోనే ఒక ఫోర్, ఒక సిక్స్ బాదడం హైదరాబాద్‌కి కలిసొచ్చింది.

Tags :

Advertisement