Advertisement

  • కొత్త అధ్యక్ష ఎన్నిక జరిగే వరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా మళ్ళీ సోనియా గాంధీ

కొత్త అధ్యక్ష ఎన్నిక జరిగే వరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా మళ్ళీ సోనియా గాంధీ

By: chandrasekar Tue, 25 Aug 2020 08:51 AM

కొత్త అధ్యక్ష ఎన్నిక జరిగే వరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా మళ్ళీ సోనియా గాంధీ


కొత్త అధ్యక్ష ఎన్నిక జరిగే వరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా మళ్ళీ సోనియా గాంధీనే కొనసాగేటట్లు నిర్ణయం తీసుకోబడింది. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న డ్రామాకు తెరపడింది. కొత్త అధ్యక్ష ఎన్నిక జరిగే వరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగనున్నారు. సోమవారం ఆన్‌‌లైన్‌లో జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో ఈ మేరకు నిర్ణయించారు. పార్టీ నాయకత్వం మార్పు కోరుతూ ఇటీవల సోనియాకు లేఖ రాసిన 23 మందిలో మెజార్టీ సభ్యులు సోనియా, గాంధీ కుటుంబం నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. తొలుత మాట్లాడిన సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. కానీ రాహుల్ గాంధీ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఇందువల్ల పార్టీకి సరైన నాయకత్వం లేకుండ అధికార పార్టీని ఎదురించి ముందుకు సాగలేకుండా వుంది.

సోనియా గాంధీ మాట్లాడుతూ తనకు ఆరోగ్యం సహకరించకపోయినా ఏడాదిగా పార్టీ బాధ్యతలు మోస్తున్నానని అన్నారు. పార్టీ నాయకత్వం మార్పును సీనియర్లు కోరుతున్నందున కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాలని సీడబ్ల్యూసీని కోరారు. వెన్నంట ఉన్న సీనియర్లు ఇలా బహిరంగ లేఖ రాయడం తనను బాధకు గురి చేసినట్లు సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తనకు ఎవరిపై ఎలాంటి కోపం లేదన్నారు. పార్టీ కోసం అంతా కలిసి పనిచేద్దామని సోనియా పిలుపునిచ్చారు. అనంతరం మాట్లాడిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సొనియా కొనసాగాలని కోరారు. మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంథోని కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత మాట్లాడిన రాహుల్ గాంధీ, పార్టీ సంక్షోభ సమయంలో, సోనియా గాంధీ అనారోగ్యంగా ఉన్నప్పుడు పార్టీ నాయకత్వం మార్పుపై కొందరు బహిరంగంగా లేఖ రాయడాన్ని తప్పుపట్టారు.

సమస్యలు వున్న పక్షంలో ఇటువంటివి పార్టీ సమావేశాల్లో చర్చించాలని గాని మీడియా ముందుకు తీసుకురావడం మంచిది కాదన్నారు. పార్టీ సీనియర్లు బీజేపీతో కుమ్మక్కయ్యారన్న అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. రాహుల్ వ్యాఖ్యలను గులాం నబి ఆజాద్, కపిల్ సిబల్ తొలుత ఖండించారు. తాము 30 ఏండ్లుగా బీజేపీకి అనుకూలంగా ఎప్పుడు మాట్లాడలేదని చెప్పారు. బీజేపీతో కుమ్మకైన విషయాన్ని నిరూపిస్తే రాజీనామా చేస్తానని గులాం నబీ ఆజాద్ అన్నారు. మరోవైపు రాహుల్ గాంధీతో వ్యక్తి‌గతంగా మాట్లాడిన తర్వాత ఆయన అలా అనలేదని తెలిసిందని కపిల్ సిబల్ చెప్పారు. దీంతో రాహుల్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ తాను చేసిన ట్వీట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు సిబల్ మరో ట్వీట్ చేశారు.

ఆన్‌‌లైన్‌లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం తర్వాత గులాం నబీ ఆజాద్ కూడా ఇదే అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. బీజేపీతో కుమ్మక్కయ్యారన్న వ్యాఖ్యలను రాహుల్ చేయలేదని ఆయన తెలిపారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రస్తుతానికి యధాతథ స్థితిని కొనసాగించాలని చివరకు సీడబ్ల్యూసీ నిర్ణయించింది. కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకునే వరకు సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరగా దానికి ఆమె అంగీకరించినట్లు సీడబ్ల్యూసీ సభ్యులు పీఎల్ పునియా, కేహెచ్ మునియప్ప తెలిపారు. సోనియా గాంధీ కుటుంబంపై సభ్యులంతా విశ్వాసం వ్యక్తం చేశారని చెప్పారు. కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకునేందుకు మరో ఆరు నెలల్లో సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతుందని వెల్లడించారు. సీనియర్ నాయకులందరూ కలసి లేఖ రాయడంతో ఇది పెద్ద సమస్యగా మారింది.

Tags :
|

Advertisement