Advertisement

  • దర్శకుడు అజయ్ భూపతి పేరిట కొంత మంది ఫోన్ కాల్స్...అమ్మాయిలను ట్రాప్ చేసే ప్రయత్నం

దర్శకుడు అజయ్ భూపతి పేరిట కొంత మంది ఫోన్ కాల్స్...అమ్మాయిలను ట్రాప్ చేసే ప్రయత్నం

By: chandrasekar Sat, 04 July 2020 12:09 PM

దర్శకుడు అజయ్ భూపతి పేరిట కొంత మంది ఫోన్ కాల్స్...అమ్మాయిలను ట్రాప్ చేసే ప్రయత్నం


దర్శకుడు అజయ్ భూపతి పేరిట కొంత మంది ఫోన్ కాల్స్, వాట్సాప్ ద్వారా అమ్మాయిలను సంప్రదిస్తున్నారు. వారిని ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన అజయ్ భూపతి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. అమ్మాయిలకి అవకాశాలు ఇస్తామంటూ నాలుగు ఫోన్ నంబర్ల నుంచి కాల్స్ వెళ్లినట్టు పోలీసులు తేల్చారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. కాగా, దీనిపై దర్శకుడు అజయ్ భూపతి స్పందించారు.

స్వయంగా ఒక వీడియోను విడుదల చేశారు. తన పేరు మీద కొంత మంది సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ మెయింటైన్ చేస్తున్నారని, కొంత మంది అమ్మాయిలకు మెసేజ్‌లు చేస్తున్నారని చెప్పారు. ‘‘15 రోజుల క్రితం ఒక అమ్మాయి ఫేస్‌బుక్‌లో నాకు మెసేజ్ చేశారు. ఒక నంబర్ నుంచి నాకు మెసేజ్ వచ్చిందండి. నేను అజయ్ భూపతిని, మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాను మీరు ఒక క్యారెక్టర్ చేయాలి అని మెసేజ్ వచ్చిందండి అని ఆమె చెప్పారు. అసలు అది మీరా కాదా అని తెలుసుకోవడానికి నేను మీకు ఫేస్‌బుక్‌లో మెసేజ్ చేశానండి అని ఆమె పేర్కొన్నారు. నా పేజ్ మెయింటైన్ చేస్తోన్న సిబ్బంది వెంటనే రిప్లై ఇచ్చారు. అలాంటివి నమ్మొద్దు అని చెప్పారు’’ అని అజయ్ భూపతి వీడియోలో వెల్లడించారు.

ఈ విషయాన్ని తాను అక్కడితో వదిలేశానని, సీరియస్‌గా తీసుకోలేదని భూపతి అన్నారు. కానీ, మళ్లీ కొంత మంది అమ్మాయిలు తన సిబ్బందికి టచ్‌లోకి రావడంతో సీరియస్‌గా తీసుకున్నానని చెప్పారు. ఈ అమ్మాయిలందరికీ ఒక నంబర్ నుంచే మెసేజ్‌లు వెళ్తున్నాయని దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఇలాంటి కాల్స్‌ను అమ్మాయిలు నమ్మవద్దని ఏవైనా పాత్రలు ఉంటే తమ ప్రొడక్షన్ హౌజ్ నుంచి కాల్స్ వస్తాయని చెప్పారు. అలాగే, తమ అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా కాల్ చేస్తారన్నారు.

తమ వైపు నుంచి కాల్స్ వస్తే ఆ ఫోన్ నంబర్ 24 గంటలు ఆన్‌లో ఉంటుందని, అదే ఫేక్ కాల్ అయితే ఓ 10 నిమిషాలు ఫోన్ ఆన్‌లో ఉంటుందని, మిగిలిన సమయమంతా స్విచ్ ఆఫ్ అయిపోతుందని అజయ్ చెప్పారు. కాగా, RX 100 తరవాత కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్న అజయ్ భూపతి ప్రస్తుతం తన రెండో ప్రాజెక్ట్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి త్వరలో ప్రకటన వెలువడుతుందని అజయ్ చెప్పారు. ఒకవేళ తన సినిమాలో కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వదలుచుకుంటే తన అధికారిక సోషల్ మీడియా ద్వారా ప్రకటన ఇస్తానని స్పష్టం చేశారు.

Tags :

Advertisement