Advertisement

  • టీ పౌడర్‌ కాటన్స్ దొంగిలించిన కేసులో ఆరుగురు అరెస్ట్‌

టీ పౌడర్‌ కాటన్స్ దొంగిలించిన కేసులో ఆరుగురు అరెస్ట్‌

By: chandrasekar Sat, 13 June 2020 1:06 PM

టీ పౌడర్‌ కాటన్స్ దొంగిలించిన కేసులో ఆరుగురు అరెస్ట్‌


గోదాం ముందు పార్కు చేసిన వాహనం నుంచి టీ పౌడర్‌ కాటన్స్‌ను దొంగిలించిన కేసులో ఆరుగురిని వనస్థలిపురం పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రూ.4.30 లక్షల విలువైన 40 టీ పౌడర్‌ కాటన్స్‌, 2 బైకులు, ఒక టాటా ఏస్‌ ట్రాలీ, రూ.55 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్‌లోని డీసీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ వివరాలను వెల్లడించారు.

వనపర్తి జిల్లాకు చెందిన రాఘవేందర్‌రావు (22), సూర్యాపేట జిల్లాకు చెందిన మోరపాక శివశంకర్‌ భరత్‌కుమార్‌ అలియాస్‌ శివ అలియాస్‌ భరత్‌ (22), మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మాదాల శివకుమార్‌ అలియాస్‌ శివ (27), గోని వినోద్‌కుమార్‌ అలియాస్‌ వినోద్‌ (20) సిద్దిపేట జిల్లాకు చెందిన గుంటి రాజు (22) వేర్వేరు పనులు చేస్తూ హైదరాబాద్‌లోని వైర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడ్డారు. జల్సాలకు అలవాటుపడిన ఈ ఐదుగురు డబ్బుల కోసం దొంగతనాలు చేసేందుకు పథకం వేశారు.

ఈ ప్రాంతాల్లో గోదాంలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. రాత్రి సమయంలో లోడ్‌తో వచ్చిన భారీ వాహనాలు ఆ మరుసటి రోజు ఉదయం అన్‌లోడ్‌ చేసి, సంబంధిత షాపులకు డెలివరీ చేస్తారు. ఈ విషయాన్ని నిందితులు గుర్తించారు. రాత్రి సమయంలో గోదాం ముందు పార్కింగ్‌ చేసిన వాహనాల్లో నుంచి టీ పౌడర్‌ కాటన్స్‌ దొంగలించేందుకు పథకం వేశారు.

చోరీ సొత్తును కొనుగోలుచేసేందుకు జిల్లేలగూడలో కిరాణా షాపు నిర్వహిస్తున్న ఉప్పు నాగరాజు అలియాస్‌ రాజుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. పథకం ప్రకారం ఈనెల ఐదో తేదీన గోదాం ముందు పార్కింగ్‌ చేసిన ఓ వాహనం నుంచి 54 టీ పౌడర్‌ కార్టన్స్‌ దొంగిలించారు. వాటిలో నుంచి 27 కాటన్స్‌ నాగరాజుకు విక్రయించి, రూ.75 వేలు తీసుకొని ఐదుగురు పంచుకున్నారు. మిగతా కాటన్స్‌ను ఐదుగురు పంచుకున్నారు.

మరుసటి ఉదయాన్నే వచ్చిన వాహనం డ్రైవర్‌ చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి సంబంధిత కంపెనీ ఇన్‌చార్జి తేజ్‌ప్రకాశ్‌ దృష్టికి తీసుకువెళ్లాడు. ఆయన వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిఘా పెటిన పోలీసులు మలక్‌పేటగంజ్‌పై దృష్టిపెట్టారు. నిందితులు చోరీ సొత్తును విక్రయించే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. టీ పౌడర్‌ కాటన్స్‌ చోరీ చేసిన ఐదుగురు నిందితులతో పాటు కొన్నింటిని కొనుగోలు చేసిన వ్యాపారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ జయరాం, వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్‌ వెంకటయ్య, డీఐ జగన్నాథ్‌ పాల్గొన్నారు.

Tags :

Advertisement