Advertisement

  • రోడ్డు ప్రమాదానికి గురైన గాయకుడు విజయ్ యేసుదాస్‌ కారు...

రోడ్డు ప్రమాదానికి గురైన గాయకుడు విజయ్ యేసుదాస్‌ కారు...

By: chandrasekar Wed, 04 Nov 2020 3:09 PM

రోడ్డు ప్రమాదానికి గురైన గాయకుడు విజయ్ యేసుదాస్‌ కారు...


కేరళలోని కొచ్చిలో ప్రముఖ నేపథ్య గాయకుడు విజయ్‌ యేసుదాసు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అర్ధరాత్రి సమయంలో జరిగిన ప్రమాదం కావడంతో విషయం బయటికి రావడానికి కాస్త సమయం పట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు లేకుండా విజయ్ బయటపడటం అభిమానులు సంతోషించాల్సిన విషయం. జాతీయ రహదారిపై వస్తున్న విజయ్ కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీ కొట్టింది. దాంతో రెండు కార్ల ముందు భాగాలు నుజ్జు నుజ్జయ్యాయి.

అసలు ఏం జరిగిందంటే తిరువనంతపురం నుంచి కొచ్చికి తన స్నేహితుడితో కలిసి అర్ధరాత్రి తన కారులోనే బయలుదేరాడు విజయ్‌. ఆయనే స్వయంగా డ్రైవ్ చేస్తున్నాడు కూడా. అయితే అప్పటి వరకు అంతా బాగానే ఉన్నా కూడా రాత్రి 11.30 గంటల తర్వాత జాతీయ రహదారిపైకి అకస్మాత్తుగా మరో కారు దూసుకొచ్చింది. దాంతో ఒక్క క్షణంలోనే కంట్రోల్ కోల్పోయాడు. అంతే ఎదుటి కారు వచ్చి విజయ్ కారును ముందు భాగంలో బలంగా ఢీ కొట్టింది. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణ చేపట్టి తప్పు ఎవరిది అనే కోణంలో ధర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో విజయ్ సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు సన్నిహితులు, అభిమానులు.

మరోవైపు విజయ్ కూడా తనకేం కాలేదని అభిమానులకు తెలిపాడు. ప్రముఖ గాయకుడు కె.జె.యేసుదాసు తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమైనా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నాడు విజయ్. అచ్చంగా నాన్నగారి వాయిస్ మాదిరే ఉండటంతో చాలా మంది సంగీత దర్శకులకు ఫేవరేట్ అయిపోయాడు విజయ్ యేసుదాస్. కానీ మలయాళంలో సింగర్స్‌కు అంతగా గుర్తింపు లేకపోవడంతో సొంత భాషలో పాటలు పాడనని ఇకపై కేవలం తమిళం, తెలుగులోనే పాడతానంటూ ఈ మధ్యే ప్రకటించాడు విజయ్ యేసుదాస్.

Tags :
|
|

Advertisement