Advertisement

కరోనాతో ఒకేసారి వృద్ధ దంపతుల మృతి...

By: chandrasekar Fri, 04 Dec 2020 9:19 PM

కరోనాతో ఒకేసారి వృద్ధ దంపతుల మృతి...


తాజాగా అమెరికాలో కరోనాతో వృద్ధ దంపతులు ఒకే సమయంలో చనిపోయిన సంఘటన ఎంతోమంది హృదయాలను కలచివేస్తోంది. మిచిగాన్‌కు చెందిన ప్యాట్రిసియా, లెస్లీ మెక్‌వాటర్స్ దంపతులు 47 సంవత్సరాలు కలిసి గడిపారు. వారి పిల్లలను, మనవరాళ్లను, మునిమనవళ్లను కూడా చూశారు. గత వారం వీరిద్దరూ ఒకే సమయంలో ప్రాణాలు వదలడం అక్కడి వారికి కన్నీరు పెట్టిస్తోంది. వీరిని కరోనా మహమ్మారి బలితీసుకుంది. "మా అమ్మానాన్నలు ప్రతీ పనినీ కలిసే చేసేవారు. చావులోనూ ఒకరికి ఒకరు దూరం కాలేదు. ఇద్దరూ ఒకేసారి చనిపోయాని తెలిసి మేమంతా షాక్ అయ్యాం" అని వారి కూతురు జోన్నా సిస్క్ అన్నారు. అమెరికాలో కరోనావైరస్‌తో ఇప్పటి వరకు 2,70,600 మందికి పైగా చనిపోయారని జాన్స్‌ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాలు చెబుతున్నాయి. మహమ్మారి ప్రభావం మెక్‌వాటర్స్ లాంటి వృద్ధులపై ఎక్కువగా ఉంటోందని డాక్టర్లు చెప్పారు.

ఈ దంపతులిద్దరూ రెండు భిన్నమైన రంగాలకు చెందినవారు. ప్యాట్రిసియా ఒక రిటైర్డ్ నర్సు. మెక్‌వాటర్స్ ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. "మా అమ్మ ప్యాట్రిసియా, నాన్న మెక్‌వాటర్స్ ఇద్దరూ అన్యోన్యంగా జీవించేవారు. ఇతరులపై ప్రేమ చూపిస్తారు. ఇద్దరూ కలిసే పార్టీలకు, ఫ్యామిలీ ఈవెంట్లకు వెళ్తారు" అని సిస్క్ తెలిపారు. ఈ దంపతులిద్దరికీ కరోనా వైరస్ సోకింది. దీంతో కొన్ని రోజులు ఐసోలేషన్‌లో ఉన్నారు. వైద్య రంగంలో 35 సంవత్సరాల అనుభవం ఉన్న ఆ బామ్మకు వారి ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తిగా తెలుసు. వైరస్ ప్రభావం తగ్గక పోవడంతో వారం రోజుల తరువాత ఈ జంట హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. వారం రోజులు ట్రీట్‌మెంట్ ఇచ్చినా ఆరోగ్యం మెరుగుపడలేదు. నవంబర్ 24న సిస్క్ తన తల్లిని ఉంచిన హాస్పిటల్ రూమ్‌లో ఉంది. ప్యాట్రిసియా ఆరోగ్యం క్షీణిస్తోందని డాక్టర్లు తెలిపారు. ఆమె శ్వాస కూడా పడిపోతోంది. సిస్క్ ఆమె చేతిని పట్టుకొని మాట్లాడే ప్రయత్నం చేసింది. అప్పుడే వేరే గదిలో చికిత్స అందిస్తున్న తన తండ్రి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణిస్తోందని, వెళ్లి ఒకసారి చూడమని సిబ్బంది సిస్క్‌తో చెప్పారు.

"ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. మా అమ్మ ఆరోగ్యం బాగాలేదని డాక్టర్లు చెప్పారు. కానీ అప్పటికి నాన్న బాగానే ఉన్నారు. అమ్మను ఉంచిన గది నుంచి నాన్న దగ్గరికి వెళ్లాను. నేను అక్కడ ఉన్నప్పుడే ఆయన కన్నుమూశారు. సరిగ్గా అదే సమయంలో అమ్మ కూడా చనిపోయిందని డాక్టర్లు పేర్కొన్నారు. చావులో కూడా వారిద్దరూ ఒకరిని ఒకరు విడిచిపెట్టలేదు" అని సిక్క్ వివరిస్తోంది. ఆ దంపతులిద్దరూ సరిగ్గా సాయంత్రం 4:23 గంటలకు చనిపోయారని డాక్టర్లు నిర్ధారించారు. తమ తల్లిదండ్రుల అంత్యక్రియల సందర్భంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మాస్క్ ధరించాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సిస్క్ అవగాహన కల్పించారు.

Tags :
|
|

Advertisement