Advertisement

థియేటర్లలో ప్రారంభమైన షోలు...

By: chandrasekar Mon, 07 Dec 2020 11:56 AM

థియేటర్లలో ప్రారంభమైన షోలు...


రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది నెలలుగా కరోనా విజృంభణతో మూతబడ్డ సినిమా హాళ్లు తెరుచుకున్నాయి. ఇక ప్రేక్షకులు సినిమా థియేటర్లకు వస్తూ వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు. మహమ్మారికి ముందు ప్రతి గురు, శుక్రవారాల్లో ఏదో ఒక సినిమా విడుదలయ్యేది. దీంతో పలు థియేటర్లలో కోలాహలం నెలకొనేది. అభిమాన హీరోలకు కటౌట్లు, పూల దండలు, అభిషేకాలతో అభిమానులు నానా హంగామా చేసేవారు. అయితే గత కొంత కాలంగా ఈ ఆర్భాటాన్ని అభిమానులు, ప్రేక్షకులు మిస్‌ అవుతూ వచ్చారు. కరోనా కాస్త తగ్గడంతో ప్రభుత్వం రాష్ట్రంలోని పలు థియేటర్లలో చిత్ర ప్రదర్శనలకు పచ్చజెండా ఊపింది. దీంతో నిర్మాతలు, పంపిణీ దారులు, థియేటర్ల యజమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే టాకీసులను ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చే పనిలో పడ్డారు. ప్రదర్శనశాలల్లో కరోనా‌ నిబంధనలుకు అనుగుణంగా శానిటైజర్లు, అవగాహన కల్పించే పోస్టర్లు, స్లోగన్స్‌, భద్రతా నిబంధనలు ఏర్పాటు చేశారు. ఇక ఒకటి రెండు చిత్రాలను విడుదల చేయగా ప్రేక్షకుల సంఖ్య ఆశాజనకంగానే ఉందని పలు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి.

రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా 50 శాతం సిట్టింగ్‌తో ప్రారంభమైన విషయం తెలిసిందే. పలు భద్రతా చర్యలు తీసుకొని ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు థియేటర్ల యజమానులు సిద్ధమయ్యారు. నగరంలో ఇప్పటికే ప్రదర్శనలను స్టార్ట్ చేశారు. ప్రసాద్స్‌ ఐమ్యాక్స్‌లో 650 సీటింగ్‌ కెపాసిటీ ఉండగా 50 శాతం సిట్టింగ్‌ అంటే 325 మంది ప్రేక్షకులకు అనుమతి ఉండగా ఆ థియేటర్‌లో 300 టికెట్లు అమ్ముడుపోయాయి. ఎల్బీనగర్‌లోని విజయలక్ష్మీ థియేటర్‌లో మార్నింగ్‌ షోకు దాదాపు 120 మంది, మ్యాట్నీకి 65 మంది ప్రేక్షకులు వచ్చారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని దేవి థియేటర్‌లో ఒక ఆటకు 130 మందికి పైగా ప్రేక్షకులు వచ్చినట్టు సమాచారం. అయితే శుక్ర, శనివారాల్లో ప్రదర్శించిన హాలీవుడ్‌ ‘టినెట్‌' సినిమాకు ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన లేదు. వచ్చే శుక్రవారం వరకు ఏదైనా తెలుగు సినిమా విడుదలైతే ప్రేక్షకులకు థియేటర్లకు రావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.




Tags :
|

Advertisement