Advertisement

  • ఆదర్శంగా నిలిచిన డాక్టర్ ట్రాన్స్ జెండర్ త్రినేత్రా...

ఆదర్శంగా నిలిచిన డాక్టర్ ట్రాన్స్ జెండర్ త్రినేత్రా...

By: chandrasekar Mon, 30 Nov 2020 7:21 PM

ఆదర్శంగా నిలిచిన డాక్టర్ ట్రాన్స్ జెండర్ త్రినేత్రా...


సాధారణ వ్యక్తులతో పోలిస్తే ట్రాన్స్ జెండర్లకు సమాజం, కుటుంబం నుంచి అవమానాలు ఎక్కువగానే ఉంటాయి. వారి బాధలు చెప్పనలవి కావు. అయితే, అటువంటి అవమానాలకు కృంగిపోకుండా తన మేధాశక్తితో డాక్టర్ అయ్యింది బెంగళూరుకు చెందిన ట్రాన్స్ జెండర్ ట్రినేత్రా హల్దార్ గమ్మరాజు. ట్రాన్స్ జెండర్లో మొట్టమొదటి డాక్టర్ గా నిలిచిన ఆమె జీవితం ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శప్రాయమైంది. 23 ఏళ్ల ట్రాన్స్ ఉమెన్ త్రినేత్రా హల్ధార్ గుమ్మరాజు ఇటీవల ఎంబిబిఎస్ పరీక్షలు పూర్తి చేసి, కర్ణాటక రాష్ట్రంలో మొదటి ట్రాన్స్ ఉమెన్ డాక్టర్ గా గుర్తింపు తెచ్చుకుంది. బెంగళూరులో జన్మించిన త్రినేత్రను లింగ మార్పిడికి ముందు అంగద్ గమ్మరాజు అని పిలిచేవారు. పురుషుడిగా జన్మించిన ఆమె 2020 ఫిబ్రవరిలో విదేశాలకు వెళ్లి లింగ నిర్ధారణ శస్త్రచికిత్స (జిసిఎస్) చేయించుకొని ట్రాన్స్ ఉమెన్ గా మారింది. లింగమార్పిడి చేయించుకున్న తర్వాత అంగద్ గమ్మరాజుగా ఉన్న ఆమె పేరును తన తల్లి దుర్గ పేరు వచ్చేలా ‘త్రినేత్ర’గా మార్చుకుంది. ఇటీవలే బెంగళూరులో మెడిసిన్ పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం మణిపాల్లోని కస్తూరి బా మెడికల్ హాస్పిటల్లో ఇంటర్న్ గా పని చేస్తుంది.

విపరీతమైన ఫాలోయింగ్..

త్రినేత్రా తన జీవిత ప్రయాణాన్ని వివరిస్తూ ‘ది ట్రినిట్రా మెథడ్’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది. దాన్ని తన యూట్యూబ్ ఛానల్లో విడుదల చేసింది. దీనితో పాటు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఆమె తాజాగా తాను ఇంటర్న్గా పనిచేస్తున్న హాస్పిటల్ ప్రాక్టికల్ సెషన్లో ఒక మహిళకు ప్రసవం చేయటాన్ని ప్రస్తావిస్తూ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఫాలోవర్స్ తో పంచుకుంది. ‘నేను ట్రాన్స్ జెండర్ అనే కారణంతో చిన్నప్పటి నుంచి అనేక అవమానాలను ఎదుర్కొన్నాను. ఇప్పటివరకు రకరకాల అసభ్యకర పేర్లతో చుట్టుపక్కల వారు నన్ను పిలుస్తూ వేధించేవారు. మొదట్లో వారి వేధింపులు నన్ను విపరీతంగా బాధించేవి. వాటన్నింటిని సహిస్తూనే చదువు మీద దృష్టి పెట్టాను. ఇటీవలే మెడికల్ కాలేజీ హాస్పిల్లో ఒక మహిళకు ప్రసవం చేశాను. ఆ బిడ్డను నా చేతుల్లో ఎత్తుకున్న క్షణం నా జీవితంలో మరుపురానిది. ఆ క్షణం నాకు జీవితాంతం గుర్తుంటుంది.” అని ఆనందంగా వివరించింది. ఏకాగ్రత, పట్టుదలతో లక్ష్యంవైపు గురిపెడితే ఎన్ని అవమానాలు ఎదురైనా అనుకున్నది సాధించవచ్చు అని నిరూపించింది త్రినేత్ర.

Tags :
|
|

Advertisement