Advertisement

జయలలిత నెచ్చెలి శశికళ విడుదలకు తేదీ ఖరారు

By: Sankar Tue, 15 Sept 2020 5:14 PM

జయలలిత నెచ్చెలి శశికళ విడుదలకు తేదీ ఖరారు


అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళను విడుదల చేసేందుకు తేదీ ఖరారైంది. 2017లో సుప్రీంకోర్టు అక్రమాస్తుల కేసులో ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. వచ్చే ఏడాది జనవరి నాటికి నాలుగేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆమె విడుదలకు రంగం సిద్దమవుతోంది.

శశికళను ఎప్పుడు విడుదల చేయబోతున్నారో చెప్పాలంటూ పరప్పన అగ్రహార జైలు అధికారులకు సమాచార హక్కు చట్టం కింద నరసింహమూర్తి అనే వ్యక్తి దరఖాస్తు చేశారు. దీనికి సమాధానంగా ఆమెను వచ్చే ఏడాది జనవరి 27న విడుదల చేసే అవకాశం ఉందని జైలు అధికారులు సమాధానం ఇచ్చారు. నిర్ణీత జరిమానా కట్టి ఆమె విడుదల కావచ్చొంటూ తెలిపారు. దీంతో శశికళ విడుదలపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడినట్లయింది.

జయలలిత సీఎంగా ఉండగా శశికళ భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆమె అప్పీలు చేసినా సుప్రీంకోర్టు కనికరించలేదు. చివరికి జైల్లో శశికళ తనకున్న పరపతితో రాజభోగాలు అనుభవిస్తోందని కూడా నిర్ధారణ అయింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న అధికారి రూప బదిలీ కావడంతో ఆ కేసు మరుగున పడిపోయింది. చివరికి ఆమెను ఈ ఏడాది ఆగస్టు 15న సత్ప్రవర్తన కారణంగా విడుదల చేయాలని భావించినా సాధ్యం కాలేదు. చివరికి ఆమె పూర్తి శిక్ష అనుభవించాకే బయటపడబోతోంది.

Tags :

Advertisement