Advertisement

టీమిండియాపై మళ్ళీ నోరుపారేసుకున్న ఆఫ్రిది ..

By: Sankar Mon, 06 July 2020 12:48 PM

టీమిండియాపై మళ్ళీ నోరుపారేసుకున్న ఆఫ్రిది ..


చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటేనే భావోద్వేగాల సమ్మేళనం. మైదానంలో ఓ యుద్ధంలాంటి వాతావరణం నెలకొంటుంది. ఇరు దేశాల అభిమానులే కాకుండా యావత్‌ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా చూస్తోంది. ఫార్మాట్ ఏదైనా.. ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ధ్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే దాయాదీ జట్లు తలపడుతున్నాయి.

అయితే దాయాదుల పోరు గురించి తాజాగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న అఫ్రిది.. పాక్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సవేరా పాషా యూట్యూబ్ చానెల్‌ ‘క్రిక్ క్యాస్ట్'షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్‌తో మ్యాచ్ ఆడటాన్ని తాను చాలా ఆస్వాదించేవాడినని చెప్పుకొచ్చాడు.భారత్‌తో మ్యాచ్‌ అంటే మేం బాగా ఎంజాయ్ చేస్తాం. ఎన్నోసార్లు భారత్‌ను ఓడించాం. అలా చిత్తుగా ఓడిపోయిన ప్రతిసారీ మ్యాచ్ తర్వాత భారత క్రికెటర్లు తమని క్షమించాలని కోరేవారు.అని తెలిపాడు.

భారత్‌, ఆస్ట్రేలియాతో పోరును నేను బాగా ఆస్వాదించేవాడిని. ఎందుకంటే ఈ రెండు చాలా బలమైన పెద్ద జట్లు. తీవ్ర ఒత్తిడిలో ఆడటం చాలా మజానిచ్చేంది.నా కెరీర్‌పరంగా గుర్తుండిపోయే ఇన్నింగ్స్ 1999 చెన్నై టెస్టులో చేసిన 141 పరుగులు.. అది కూడా భారత్‌పైనే. వాస్తవానికి ఆ సిరీస్‌‌కు తొలుత నేను ఎంపికవ్వలేదు. కానీ.. వసీమ్ అక్రమ్ మద్దతుతో ఆ భారత్ పర్యటనకి వెళ్లగలిగాను అని అఫ్రిది వెల్లడించాడు.

షాహిద్ అఫ్రిదీ వ్యాఖ్యలపై భారత అభిమానులు సోషల్ మీడియా మండిపడుతూ.. భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న రికార్డుల్ని గుర్తు చేస్తున్నారు. ఇటీవల కరోనా వైరస్ బారినపడిన అఫ్రిదీ.. నాలుగు రోజుల క్రితం కోలుకున్నాడు. దాంతో ఒకవేళ వైరస్ ప్రభావం కారణంగా అతని మతిపోయిందా ఏంటి, అతని వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోనవసరం లేదు అని కొంతమంది నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అతను ఏం మాట్లాడుతున్నాడో. అతనికే అర్థం కావడం లేదంటూ మరికొందరు జోక్‌లు పేలుస్తున్నారు. 'ఆర్ యు ఓకే' అఫ్రిదీ.. మానసికంగా బాగానే ఉన్నావ.. నీకు ఇంకా విశ్రాంతి కావాలి అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.


Tags :
|

Advertisement