Advertisement

  • రష్యా వ్యాక్సిన్ ప్రకటన అంత నమ్మదగినదిగా లేదని పెదవి విరుస్తున్న శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు

రష్యా వ్యాక్సిన్ ప్రకటన అంత నమ్మదగినదిగా లేదని పెదవి విరుస్తున్న శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు

By: chandrasekar Thu, 13 Aug 2020 12:45 PM

రష్యా వ్యాక్సిన్ ప్రకటన అంత నమ్మదగినదిగా లేదని పెదవి విరుస్తున్న శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు


కరోనా టీకా కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తున్న వేళ రష్యా ‘టీకా’ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆశను రేపింది. కరోనా త్వరలోనే అంతం కానున్నదన్న ధైర్యాన్ని తెచ్చినది. మళ్లీ మామూలుగా జీవనాన్ని సాగించవచ్చని అందరూ అనందపడ్డారు. అయితే స్పుత్నిక్‌ వీ టీకా తయారీ విధానంపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. క్లినికల్‌ ట్రయల్స్‌ వివరాలు, ఫలితాలు వెల్లడించకుండా మూడో దశ హ్యూమన్‌ ట్రయల్స్‌ నిర్వహించకుండా టీకాను తీసుకురావడం ఏమిటని ప్రశ్నలు సంధిస్తున్నారు. టీకా సమర్థతకు ఆధారాలేవని అడుగుతున్నారు. రష్యా ప్రకటన అంత నమ్మదగినదిగా లేదని పెదవి విరుస్తున్నారు.

ప్రపంచం దృష్టిలో పడటానికి రష్యా తన ప్రజలపైనే పరీక్షలకు దిగుతున్నదని ఆరోపిస్తున్నారు. రష్యా తయారు చేసిన కరోనా టీకా ‘స్పుత్నిక్‌ వీ’పై భారత్‌ సహా అనేక దేశాల శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్లినికల్‌ ట్రయల్స్‌ సమాచారాన్ని బహిర్గతం చేయకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు నెలల కంటే తక్కువ సమయంలోనే ట్రయల్స్‌ నిర్వహించి టీకాకు అనుమతినివ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. టీకా సమర్థతపై సరైన ఆధారాలు లేవని వారు చెప్తున్నారు. ‘రష్యా టీకా ఎంత మేరకు సురక్షితం, కరోనాపై ఎంత ప్రభావం చూపుతుందన్నది ఇంకా అంచనాకు రావాల్సి ఉన్నది. టీకా రోగ నిరోధక శక్తిని పెంచాలి. అదే సమయంలో ఎలాంటి దుష్ప్రభావాలు ఉందకూడదు’ అని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అభిప్రాయపడ్డారు. రష్యా ప్రకటన అంత నమ్మదగినదిగా లేదని ప్రముఖ్య ఇమ్యునాలజిస్టు వినీతా బాల్‌ అభిప్రాయపడ్డారు.

టీకాపై ఎన్ని దశల క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించారు? ఫలితాలేంటి? అన్న విషయాలు తెలియకుండా టీకాను విశ్వసించలేమని చెప్పారు. వీరితో పాటు అనేక మంది వైద్య నిపుణులు ఈ టీకాపై అనుమానాలను వ్యక్తం చేశారు. తామే ముందు టీకా తెచ్చామన్న పేరు కోసం రష్యా తన ప్రజలపైనే ప్రయోగాలు నిర్వహిస్తున్నదని బ్రిటన్‌లోని వార్విక్‌ బిజినెస్‌ స్కూల్‌ శాస్త్రవేత్త అయిఫర్‌ అలీ అన్నారు. ‘రష్యా టీకాకు మూడో దశ హ్యూమన్‌ ట్రయల్స్‌ జరుగలేదు. అది సురక్షితమైనదేనా అన్నది ఎవరికీ తెలియదు. రష్యా తమ వైద్యులను, ప్రజలను ప్రమాదంలోకి నెడుతున్నది’ అని అమెరికా శాస్త్రవేత్త ఫ్లోరియాన్‌ క్రామ్మర్‌ అన్నారు. రష్యా అధికారులు టీకాకు అనుమతినివ్వడం ‘ఒక మూర్ఖపు చర్య’ అని లండన్‌ వర్సిటీ వైద్య నిపుణుడు ఫ్రాంకోయిస్‌ బౌలక్స్‌ అన్నారు. సరైన పరీక్షలు నిర్వహించకుండా ప్రజలకు టీకా వేయడం అనైతికమని ఆయన అభిప్రాయపడ్డారు. రష్యా చర్య అత్యంత నిర్లక్ష్యమైనదని జర్మనీ శాస్త్రవేత్త పీటర్‌ క్రెమ్స్‌నలర్‌ అన్నారు. ఆయన జర్మనీ టీకా క్యూర్‌వాక్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను పర్యవేక్షిస్తున్నారు.

వ్యాక్సిన్‌ను పరిశీలిస్తాం

రష్యా తయారు చేసిన వ్యాక్సిన్‌ను పరిశీలిస్తామని ఇజ్రాయెల్‌ ఆరోగ్య మంత్రి యులి ఎడైల్‌ైస్టెన్‌ అన్నారు. టీకా సమర్థతను కచ్చితంగా అంచనా వేసిన తర్వాతే వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసే అంశంపై రష్యాతో చర్చలు జరుపుతామన్నారు. తాము అభివృద్ధి చేసిన టీకా మొదటి బ్యాచ్‌ మరో రెండు వారాల్లో దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్‌ మురాస్కో వెల్లడించారు. టీకా భద్రతపై వస్తున్న విమర్శలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. క్లినికల్‌ ట్రయల్స్‌ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన గమాలయా ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ గింట్స్‌బర్గ్‌ తెలిపారు. కాగా, రష్యా టీకాకు అనుమతిపై ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులతో చర్చిస్తున్నామని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. వ్యాక్సిన్‌ సమర్థతను పూర్తిగా అంచనా వేయాల్సి ఉందని సంస్థ అధికార ప్రతినిధి తరీక్‌ జసరేవిక్‌ చెప్పారు.

Tags :

Advertisement