Advertisement

  • పరీక్షలు లేకుండా పాస్‌ చేయొద్దు - సుప్రీంకోర్టు ఆదేశం

పరీక్షలు లేకుండా పాస్‌ చేయొద్దు - సుప్రీంకోర్టు ఆదేశం

By: Dimple Sun, 30 Aug 2020 00:43 AM

పరీక్షలు లేకుండా పాస్‌ చేయొద్దు - సుప్రీంకోర్టు ఆదేశం

విశ్వవిద్యాలయాలు.. తుది సంవత్సరం పరీక్షలు నిర్వహించాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. నిర్వహించకుండా విద్యార్థులను ప్రమోట్‌ చేయడం కుదరదని తేల్చి చెప్పింది. సెప్టెంబరు 30లోపు దేశంలోని విశ్వవిద్యాలయాలన్నీ తుది సంవత్సరం పరీక్షలు ముగించాలంటూ జులై 6న యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) జారీ చేసిన మార్గదర్శకాలను సమర్థించింది. విద్యార్థుల సమర్థత తెలుసుకోవడానికి, వారి ప్రతిభను నిర్ధారించడానికి ఆఖరి సంవత్సర పరీక్షలు కీలకమని వ్యాఖ్యానించింది. అనివార్య కారణాలతో నిర్వహించలేని పరిస్థితుల్లో ఏ రాష్ట్రాలైనా ఉంటే.. అవి తప్పనిసరిగా యూజీసీని సంప్రదించి కొత్త తేదీలను ఎంపిక చేసుకోవాలని తన ఆదేశాల్లో స్పష్టంచేసింది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని.. తప్పనిసరిగా ఫైనల్‌ పరీక్షలు నిర్వహించాలంటూ యూజీసీ జారీ చేసిన మార్గదర్శకాలను రద్దుచేయాలంటూ శివసేన యువ విభాగం.. కొంత మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. ‘‘విపత్తు నిర్వహణ చట్టం కింద పరీక్షలను రాష్ట్రాలు వాయిదా వేసుకోవచ్చు. కానీ యూజీసీని సంప్రదించి కొత్త తేదీలను నిర్ణయించుకోవాలి. తుది సంవత్సరం/సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించకుండానే గత సంవత్సరం ప్రతిభ, అంతర్గత మదింపు ఆధారంగా పై తరగతులకు పంపే న్యాయపరిధి ప్రకృతి వైపరీత్య చట్టం-2005లోని అధికారాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకుకానీ, రాష్ట్ర ప్రకృతి వైపరీత్య నిర్వహణ ప్రాధికార సంస్థలకు కానీ లేదు. ఒకవేళ అవి జులై 6నాటి యూజీసీ జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకొని ఉన్నా యూజీసీ మార్గదర్శకాలే చెల్లుబాటవుతాయి. ఆ మార్గదర్శకాల్లో తప్పనిసరిగా తుది సంవత్సరం/సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించాల్సిందేనని యూజీసీ నిర్దేశించింది.

కాబట్టి అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రకృతి వైపరీత్య సంస్థలు ఉత్తర్వులు జారీచేసినా అవి చెల్లుబాటుకావు. ఆ మార్గదర్శకాలనుకానీ, అదేరోజు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ జారీచేసిన ఆఫీస్‌మెమోరాండంనుకానీ, కేంద్ర హోంశాఖ జారీచేసిన లేఖనుకానీ కొట్టేయలేం. సెప్టెంబరు 30వ తేదీలోపు పరీక్షలు నిర్వహించాలని యూజీసీ మార్గదర్శకాలు జారీచేసినప్పటికీ, ప్రకృతి వైపరీత్య నిర్వహణ చట్టంలోని అధికారాలను అనుసరించి ఆ పరీక్షలను ఆ తేదీలోపు పరీక్షలు నిర్వహించకూడదని ఇప్పటికే నిర్ణయం తీసుకొని ఉంటే అది ఆ రాష్ట్రం వరకు చెల్లుబాటు అవుతుంది. అలా కాకుండా ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే పాత సంవత్సర ప్రతిభ, అంతర్గత మూల్యాంకనం ఆధారంగా విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని నిర్ణయిస్తే మాత్రం చట్ట ప్రకారం కుదరదు. తుది పరీక్షలు నిర్వహించకుండా రాష్ట్రాలుకానీ, యూనివర్శిటీలుకానీ విద్యార్థులను ప్రమోట్‌ చేయలేవు.
పరీక్షలు నిర్వహించడం సాధ్యంకాదని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నట్లయితే, అలాంటి ప్రభుత్వాలు డెడ్‌లైన్‌ను పొడిగించమని యూజీసీకి దరఖాస్తు చేసుకొనే స్వేచ్ఛనిస్తున్నాం. ఆ దరఖాస్తులను యూజీసీ పరిశీలించి కొత్త తేదీలను సంబంధిత ప్రభుత్వాలకు సాధ్యమైనంత త్వరగా చెప్పాలి’’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. మహారాష్ట, దిల్లీ రాష్ట్రాలు తమ పరిధిలోని తుది సంవత్సర పరీక్షలను ఇప్పటికే రద్దు చేశాయి. దీనిపై యూజీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

Tags :
|
|
|

Advertisement