Advertisement

  • ఎన్నికల ప్రచారంలో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ పై చెప్పులు

ఎన్నికల ప్రచారంలో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ పై చెప్పులు

By: chandrasekar Wed, 21 Oct 2020 09:52 AM

ఎన్నికల ప్రచారంలో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ పై చెప్పులు


రాజకీయ నాయకులు ప్రజల ఆగ్రహానికి లోనవ్వడంతో ఎన్నికల ప్రచారంలో నాయకుడిపై చెప్పులు విసిరిన సంఘటన బీహార్ లో చోటుచేసుకుంది. బిహార్‌ ఎన్నికల ర్యాలీలో ఆర్జేడీ నేత, విపక్షాల కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల సభలో పాల్గొన్న ఆయనపైకి గుర్తు తెలియని వ్యక్తి చెప్పులు విసిరారు. ఓ చెప్పు ఆయన తల భాగం పైనుంచి వెళ్లగా మరో చెప్పు నేరుగా వచ్చి ఆయన ఒళ్లో పడింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మంగళవారం, అక్టోబర్ 20 సాయంత్రం ఔరంగాబాద్‌ జిల్లా ‘కుటుంబ’ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో తేజస్వి యాదవ్‌ పాల్గొన్న సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి తరఫున ప్రచారం కోసం వచ్చిన తేజస్వి సభా వేదికపై కూర్చున్నారు. ఆయన మద్దతుదారులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

వేదికపై వున్న తేజస్వి యాదవ్‌ పై ఇంతలోనే జనం మధ్యలో నుంచి అకస్మాత్తుగా రెండు చెప్పులు దూసుకొచ్చాయి. ఈ ఘటన అనంతరం తేజస్వి యాదవ్ యథావిధిగా తన ప్రసంగం కొనసాగించడం విశేషం. చెప్పుల విషయాన్ని ప్రస్తావించకుండా ప్రసంగించారు. అలాంటి తీవ్రమైన ఘటన జరిగిన తర్వాత కూడా హుందాగా వ్యవహరించారు. ఎన్డీఏ కూటమిపై తనదైన శైలిలో విమర్శలు కురిపించారు. ఆర్ జె డి మరియు జేడీయూ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తేజస్వి యాదవ్ ప్రస్తుతం తన తండ్రి లాలూ జైల్లో ఉండటంతో ప్రచార బాధ్యతలన్నీ తన భుజాలపై వేసుకున్నారు. విపక్షాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కుటుంబ సభలో మాట్లాడుతూ నితీశ్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. బిహార్‌కు ప్రత్యేక హోదా తీసుకురావడంలో నితీశ్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

ప్రచారంలో భాగంగా డబుల్ ఇంజన్ ప్రభుత్వం జేడీయూ మరియు బీజేపీ రాష్ట్రంలో ప్రజల కోసం ఏమీ చేయలేదని తేజస్వి యాదవ్ విమర్శించారు. పేదరికం, నిరుద్యోగ సమస్యలను నిర్మూలించలేకపోతున్నారని మండిపడ్డారు. ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. తేజస్వి పైకి ఎవరు, ఎందుకు చెప్పులు విసిరారో మాత్రం తెలియలేదు. ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్‌ తివారీ ఈ ఘటనను ఖండించారు. ప్రస్తుత ఎన్నికల బహిరంగ సభల సందర్భంలో విపక్ష నేతలకు సరైన భద్రతా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, వామపక్షాలతో కలిసి ఆర్జేడీ కూటమి ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మొత్తం 243 స్థానాలకు గాను RJD 144 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దించుతోంది. మిగిలిన స్థానాలను మిత్ర పక్షాలకు వదిలేసింది. ఈ ఎన్నికలు మరింత కీలకంగా మారనుంది.

Tags :

Advertisement