Advertisement

  • సఫా బైతుల్ మాల్ సంస్థ వినూత్న రీతిలో హైదరాబాద్ వరద బాధితులకు సాయం

సఫా బైతుల్ మాల్ సంస్థ వినూత్న రీతిలో హైదరాబాద్ వరద బాధితులకు సాయం

By: chandrasekar Sat, 31 Oct 2020 1:18 PM

సఫా బైతుల్ మాల్ సంస్థ వినూత్న రీతిలో హైదరాబాద్ వరద బాధితులకు సాయం


భారీ వర్షాలు, భారీ వరదకు భాగ్యనగరం అతలాకుతలం అయిపోయింది. ముఖ్యంగా మూసీ, దాని పరివాహక ప్రాంతాల ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతికారు. అలాగే, చాలా ప్రాంతాల్లోకి నీరు చేరింది. బియ్యం కొట్టుకుపోయాయి. ప్రభుత్వం సాయం చేస్తామని ప్రకటించింది. ఆ సాయంలో కూడా స్థానిక నేతలు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.10,000 సాయం ప్రకటిస్తే లోకల్ లీడర్లు రూ.5000 నొక్కేస్తున్నారనే బాధితులు ఆరోపించిన వీడియో కూడా ఇటీవల బయటకు వచ్చింది. ప్రభుత్వం మాత్రమే కాకుండా చాలా మంది వరద బాధితులకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. అందులో కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి సఫా బైతుల్ మాల్. హైదరాబాద్ నగరానికి చెందిన ఈ స్వచ్ఛంద సంస్థ వినూత్న రీతిలో హైదరాబాద్ వరద బాధితులకు సాయం అందిస్తోంది. హైదరాబాద్ బాలాపూర్‌లోని పెరల్స్ గార్డెన్ అనే ఫంక్షన్ హాల్లో మూడు రోజుల పాటు మేళా నిర్వహించారు. అందులో వరద బాధితులకు కావాల్సిన అన్నీ ఉన్నాయి. వరద బాధితులకు డబ్బులు ఇచ్చే బదులు వారికి అవసరమైన సామాగ్రి ఇస్తే బాగుంటుందనే ఆలోచనతోనే ఇలాంటి మేళా నిర్వహించారు. అంతకు ముందు స్థానికంగా వరద ఎంత నష్టాన్ని కలిగించిందనేది సమగ్రంగా అంచనా వేసి ఇంటికి రూ.5000 నుంచి రూ.10,000 చొప్పున కూపన్లు ఇచ్చారు. ఆ కూపన్లు పొందిన వారు ఈ మేళాకు వచ్చి తమ దగ్గర ఉన్న కూపన్‌కు సరిపడిన విలువైన వస్తువులను తీసుకుని వెళ్లవచ్చు.

ఓ కుటుంబానికి అవసరమైన దాదాపు 170 వస్తువులు అక్కడ ఉంచారు. వాటి మొత్తం విలువ సుమారు రూ.50 లక్షలు. అక్కడ కిచెన్ సామగ్రి, దుస్తులు, దుప్పట్లు, అన్నీ అందుబాటులో ఉన్నాయి. శుక్రవారంతో ముగిసిన ఈ మేళాకు చాలా మంది మహిళలు హాజరయ్యారు. తమ చేతిలో ఉన్న టోకెన్‌కు సరిపడినన్ని వస్తువులు తీసుకుంటున్నారు. కొందరు మ్యాట్లు, బెడ్ షీట్లు, బ్లాంకెట్లు కొంటే, మరికొందరు కిచెన్ సామగ్రి, కుక్కర్లు, మగ్గులు, బకెట్లు, ప్లేట్లు కొంటున్నారు. ‘బాధితులకు డబ్బులు ఇవ్వడం కంటే ఇలా అవసరమైన వస్తువులు ఇవ్వడం మంచిదని ఇలా చేస్తున్నాం.’ అని సఫా బైతుల్ మాల్‌కు చెందిన గ్యాస్ అహ్మద్ రిషాదీ చెప్పారు. అదే సమయంలో సాయం చేసే వారు ఇచ్చినవి తీసుకునే కంటే ఇలాంటి మేళా వల్ల తమకు ఏం అవసరమో వాటిని తీసుకునే అవకాశం ఉందని ఓ మహిళ సంతోషం వ్యక్తం చేసింది. ఆమె సరికొత్త కుక్కర్‌ను తీసుకుని వెళ్తోంది. ఈ మేళా ఇప్పటితో అయిపోలేదని నిర్వాహకులు తెలిపారు. రాబోయే రోజుల్లో మళ్లీ నిర్వహించనున్నారు. ఈసారి నవంబర్ 4 నుంచి మరోసారి మేళా నిర్వహించనున్నారు. చాలా మంది దాతలు ఇచ్చిన వాటితో పాటు తమ స్వచ్ఛంద సంస్థ ఆ వస్తువులను భారీ ఎత్తున కొనుగోలు చేసి ఇలా వరద బాధితులకు అందజేస్తోంది.

Tags :
|

Advertisement