Advertisement

  • రెండవ కరోనా వ్యాక్సిన్ పై రష్యా మరో సంచలన ప్రకటన...

రెండవ కరోనా వ్యాక్సిన్ పై రష్యా మరో సంచలన ప్రకటన...

By: chandrasekar Thu, 15 Oct 2020 12:08 PM

రెండవ కరోనా వ్యాక్సిన్ పై రష్యా మరో సంచలన ప్రకటన...


కరోనా వ్యాక్సిన్ రేసులో ముందు మేమే అంటూ సంచలనం సృష్టించిన రష్యా ఇప్పుడు మరో కీలక ప్రకటన చేసింది. రెండవ కరోనా వ్యాక్సిన్ తయారీకు ఆ దేశం సిద్ధమవుతోంది. రష్యన్ రెగ్యులేటరీ దీనికి సంబంధించి అనుమతులు జారీ చేసింది. స్పుత్నిక్ వి రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్. ప్రపంచంలో అందరికంటే ముందుగా రిజిస్టర్ చేయడమే కాకుండా వ్యాక్సిన్ పంపిణీ కూడా ప్రారంభించేసింది. ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు చేయకుండానే రిజిస్టర్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక అనుమానాలు తలెత్తాయి. రష్యా వ్యాక్సిన్ సామర్ధ్యంపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ సందేహాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు రష్యా మూడో దశ ప్రయోగాల్ని భారీగా అంటే ఏకంగా 40 వేల మందిపై ప్రారంభించింది.

ఇటీవలే స్పుత్నిక్ వి వ్యాక్సిన్ పంపిణీకు సిద్ధంగా ఉందని కూడా ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీ కోసం భారతదేశ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తో ఒప్పందం కూడా జరిగింది. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశారు. కోవిడ్ 19 రెండవ వ్యాక్సిన్‌కు రష్యా రెగ్యులేటరీ అనుమతి ఇచ్చినందుకు సంతోషంగా ఉందని ఓ ప్రభుత్వం సమావేశంలో వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. వ్లాదిమిర్ పుతిన్ చెబుతున్న ఈ రెండవ కరోనా వ్యాక్సిన్ ను సైబీరియాకు చెందిన వెక్టార్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసింది. గత నెలలో ప్రారంభ దశ మానవ పరీక్షలను పూర్తి చేసినందుకు పుతిన్ శాస్త్రవేత్తలను అభినందించారు. ఇక మొదటి, రెండవ వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి విదేశీ భాగస్వాములతో కూడా పనిచేస్తున్నామనీ, విదేశాలకు సైతం తమ టీకాను అందిస్తామని చెప్పారు.

Tags :
|

Advertisement