Advertisement

మరో వ్యాక్సిన్ను సిద్ధం చేస్తోన్న రష్యా...

By: chandrasekar Mon, 24 Aug 2020 4:45 PM

మరో వ్యాక్సిన్ను  సిద్ధం చేస్తోన్న రష్యా...


ప్రపంచంలోనే కరోనా వైరస్ మహమ్మారిపై తొలి వ్యాక్సిన్‌కు రష్యా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. స్పుత్నిక్‌-వీ పేరుతో టీకాను అభివృద్ధి చేసిన రష్యా తొలి బ్యాచ్ ఉత్పత్తి కూడా పూర్తయినట్టు తెలిపింది. కానీ, ప్రస్తుతం తాజాగా మరో వ్యాక్సిన్‌ను రష్యా సిద్ధం చేస్తోంది. వెక్టర్‌ స్టేట్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆఫ్‌ వైరాలజీ అండ్‌ బయోటెక్నాలజీ అభివృద్ధి చేసిన ‘ఎపివాక్‌ కరోనా’ టీకా మానవ క్లినికల్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వెల్లడయినట్టు ఓ నివేదిక పేర్కొంది. వ్యాక్సిన్ సురక్షితమైందేనని తేలిందని నివేదిక వివరించింది.

రష్యా ఫెడరల్‌ సర్వీస్‌ ఫర్‌ సర్వీలియెన్స్‌ ఆన్‌ కన్జ్యూమర్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ హ్యూమన్‌ వెల్‌బీయింగ్‌ సంస్థ ఈ క్లినికల్‌ ప్రయోగాలు వచ్చే నెలలో పూర్తవుతాయని వెల్లడించింది. ఎపివాక్ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో ఇప్పటి వరకు 57 మంది వాలంటీర్లపై ప్రయోగించగా ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదని తెలిపింది. వాలంటీర్లకు 14 నుంచి 21 రోజుల వ్యవధిలో రెండు డోసులు ప్రయోగించగా వారిలో కరోనాను ఎదుర్కొనే రోగనిరోధకత చూపిందని తెలిపింది. అయితే, కేవలం ఒక్క వాలంటీర్‌కు మాత్రమే రెండు డోస్‌లు ఇచ్చినట్టు నివేదిక పేర్కొవడం గమనించదగ్గ విషయం.

ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ముందే ‘స్పుత్నిక్-వి’ పేరిట కరోనా వ్యాక్సిన్‌ను రష్యా ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ, పూర్తిస్థాయిలో ప్రయోగాలు నిర్వహించకుండా హడావుడిగా టీకాను తీసుకొచ్చిందని అంతర్జాతీయ సమాజం తప్పుబడుతోంది. అతికొద్ది మందిపై కేవలం రెండు దశల ప్రయోగాలు మాత్రమే చేసి మార్కెట్లోకి వ్యాక్సిన్ విడుదల చేయడం సరికాదని ప్రపంచ దేశాలు విమర్శలు చేస్తున్నాయి. రష్యా వ్యాక్సిన్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద కూడా సమాచారం లేకపోవడం సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పునరాలోచనలో పడిన రష్యా, అడ్వాన్స్‌డ్ ట్రయల్స్ చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో 40వేల మంది వాలంటీర్లపై వ్యాక్సిన్ ప్రయోగించనున్నట్లు రష్యా తెలిపింది.

Tags :
|

Advertisement